రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షా రాజకీయాలు సర్వసాధారణం అయ్యాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను టార్గెట్ చేసిన జగన్…పనిగట్టుకొని మరీ రివేంజ్ తీర్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అయినా సరే తీరు మారని జగన్…టీడీపీ నేతలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ఘటన ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ వ్యవహారంలో అయ్యన్న పాత్రుడికి ఊరటనిచ్చిన ఏపీ హైకోర్టు….సీఎం జగన్ కు షాకిచ్చింది. తన ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతపై అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కూల్చేసిన గోడను తిరిగి నిర్మించుకునేందుకు హైకోర్టు అనుమతించింంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలున్నాయి కాబట్టి రాష్ట్రంలో బతగ్గలుగుతున్నామని, లేదంటే తమలాంటి వారిని కొట్టి చంపేసి ఉండేవారని అయ్యన్న షాకింగ్ కామెంట్లు చేశారు.
తమను భయపెట్టి లొంగదీసుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని, ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో కొట్టించినట్టు తనను కూడా కొట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే, శని, ఆదివారాల్లో పోలీసులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపణలు చేశారు. ఆ రెండు రోజుల్లో కోర్టుకు సెలవు కాబట్టి ఏం చేయలేరని భావిస్తున్నారని అన్నారు. వైసీపీ వాళ్లకు వాళ్ల భాషలో మాట్లాడితేనే అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.
ఇక, ఆంధ్రా యూనివర్సిటీ పరువు తీశానని కొత్తగా తనపై మరో కేసు పెట్టారని, భయపెట్టి గొంతు నొక్కేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయాలంటే కేసు నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, దానిని ఆన్లైన్లోనూ పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా ఇంటికొస్తే కాపాడేందుకు కోర్టులు ఉన్నాయని, భగవంతుడు కూడా ఉన్నాడని అయ్యన్న చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు.