ఇటీవల హెటిరో ఫార్మా సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. హెటిరో సంస్థలో దొరికిన కోట్లాది రూపాయలు జగన్ వేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ క్విడ్ ప్రోకో-1, 2లలో పేరున్న హెటిరో సంస్థకు జగన్ విశాఖ సమీపంలో 108 ఎకరాలు కారుచౌకగా అప్పగించారని ఆరోపిస్తున్నారు.
విశాఖలోని బేపార్క్ లో రూ.265కోట్ల విలువైన 9ఎకరాలను హెటిరోకు జగన్ గిఫ్ట్ గా ఇచ్చారని, సీబీఐ, ఈడీ కేసులున్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు సభ్యుడిగా చేశారని ఆరోపించారు. 2017 నాటికి రూ.2,360కోట్లుగా ఉన్న హెటిరో సంస్థ ఆదాయం జగన్ సీఎం అయిన తర్వాత రూ.5,389కోట్లకు చేరిందని ఆరోపించారు. అరబిందో, హెటిరో సంస్థల్లో మెడిసిన్స్ కాకుండా….జగన్ కు చెందిన వేల కోట్ల నోట్లు తయారవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా జగన్ దేనని, జగన్ మల్లెపూలు కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. హెటిరో సంస్థలో ఈడీ సోదాల్లో దొరికింది రూ.147 కోట్లు మాత్రమేనని, ఇంకా దొరకని సొమ్ము వేల కోట్లుంటుందని ఆరోపించారు. జగన్ సీఎం అయిన రెండున్నరేళ్లలో దోచిన సొమ్మంతా అక్కడ దాచారని షాకింగ్ కామెంట్లు చేశారు.
విశాఖలోని వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు జగన్ తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ కు అన్ని సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలే జగన్ ను కొట్టే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై ఏం అవగాహన ఉంటుందని అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్…రెండున్నరేళ్లయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఆదాయానికి మించి అప్పులు చేస్తున్న జగన్…ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు మద్యం చాటున దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. యువతకు జగన్ డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. త్వరలోనే జగన్ పాలనకు జనం చరమ గీతం పాడతారని జోస్యం చెప్పారు.