మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు.
బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.
ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనల్లో ముఖ్యాంశాల్ని చూస్తే..
– సీబీఐ దగ్గర దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ తప్పించి ఇంకే ఆధారాల్లేవు
– దస్తగిరిని బెదిరించి స్టేట్ మెంట్ తీసుకున్నారు
– వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు
– భాస్కర్ రెడ్డి పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఆయన్ను అరెస్టు చేశారు
– ఆయన్ను అరెస్టు చేయటానికి దస్తగిరి కన్ఫెషన్ తప్పించి సీబీఐ దగ్గర మరే ఆధారం లేదు
– దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురి చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు
– సీబీఐకి భయపడి దస్తగిరి భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు
అవినాశ్ తరఫు న్యాయవాదులు ఈ తరహా వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన అంశాల్ని ప్రస్తావించారు.
వివేకా హత్యకు నాలుగు కారణాలు ఉన్నట్లుగా కోర్టుకు తెలిపారు. ‘
వివేకా హత్యకు నాలుగు కారణాలు ఉన్నాయి.
ఒకటి కుటుంబం.
రెండోది వ్యాపార సంబంధాలు. మూడోది వివాహేతర సంబంధాలు.
నాలుగోది పొలిటికల్ గెయిన్.
వీటన్నింటి మీదా సీబీఐ ఫోకస్ పెట్టలేదు’ అని అవినాశ్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతుందని వాపోయారు. రాజకీయ కోణంలో భాస్కర్ రెడ్డి.. అవినాశ్ రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే అని వాదించారు.
వీరి వాదనల నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్ రెడ్డిని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే విచారణకు పిలవాలంటూ సీబీఐకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
దీంతో.. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.