వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 48 గంటల్లోపు మరో అరెస్ట్ ఉండే అవకాశం ఉందని రఘురామ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందంటూ పరోక్షంగా రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
‘‘సిబిఐ జోరు మా వైకాపా బేజారు హూ కిల్డ్ బాబాయ్’’ అంటూ రఘురామ సెటైర్లు వేశారు. హత్యకు ముందు ఎవరెవరు కలిశారో ఎక్కడ కలిశారో అన్న కోణంలో విచారణ జరిగిందని రఘురామ అన్నారు. గూగుల్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లుగా స్పష్టమైందని ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారని రఘురామ చెప్పారు. వివేకాను దారుణంగా హత్య చేసి గుండెపోటు అని కలరింగ్ ఇచ్చారని జగన్ కూడా అలాగే చెప్పారని రఘురామ గుర్తు చేశారు.
శవాన్ని ఫ్రీజర్ లో పెట్టి రక్తం కనిపించకుండా పూలు కూడా ఏర్పాటు చేశారని రఘురామ అన్నారు. వైయస్ భాస్కర్ రెడ్డి…వైయస్ భారతి రెడ్డికి స్వయానా మేనమామ అని, ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి కన్ఫామ్ అని తెలిసిన తర్వాత కూడా చంపడం ఎందుకని ప్రశ్నించారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలపై ఈ హత్యానేరం మోపాలని చూశారని, కానీ, వాళ్లే సిబిఐ విచారణకు అడగడంతో వెనకడుగు వేశారని అన్నారు.
భాస్కర్ రెడ్డి అరెస్టుతో సజ్జల షాక్ కు గురై ఉంటారని, ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడింది సజ్జలేనని అన్నారు. ఆదివారం ఉదయం నుంచి వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడటం లేదని ఎత్తిపొడిచారు. నిజమైన దోషులు ఎవరో వైఎస్ సునీతా రెడ్డికి తెలుసని, ఇదే పట్టుదలతో వెళ్లి తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేసి తండ్రి రుణం తీర్చుకోవాలని అన్నారు. సునీత రెడ్డి పోరాటం మహిళా లోకానికి ఆదర్శమని కొనియాడారు.