ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ పూటకో యూటర్న్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. తన కొడుకుకు బెయిల్ వచ్చిన నేపథ్యంలోనే తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో సీబీఐ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు అందించిన నివేదికలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ8గా సీబీఐ పేర్కొంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ఎనిమిదవ నిందితుడని నివేదిక సమర్పించింది. వివేకా హత్యకు కుట్ర, వివేకా హత్య అనంతరం సాక్షాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్ రెడ్డితోపాటు వైఎస్ అవినాష్ రెడ్డిల పాత్ర కూడా ఉందని సీబీఐ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి ఆ తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు విశ్వ ప్రయత్నాలు చేశారని కూడా సీబీఐ పేర్కొంది. అంతేకాదు, శివ శంకర్ రెడ్డి వివేకా హత్య గురించి ఫోన్ చేసిన 10 నిమిషాలలో అవినాష్ ఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించింది. హత్య జరిగింది 5 గంటల 20 నిమిషాలకు అని, అంతకుముందే అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్టుగా దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని కూడా సిబిఐ తెలిపింది.
వివేకా హత్య గురించి కేసు పెట్టవద్దని పోస్టుమార్టం కూడా వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి చెప్పారని కూడా సీబీఐ తన నివేదికలో పేర్కొంది. వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించేలాగా తండ్రీకొడుకులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారని సీబీఐ ఆరోపించింది.