హైదరాబాద్ లో ఓ ఆటోవాలా గిరాకీ లేదని.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని చేసిన అతి చేష్ట షాకింగ్ గా మారింది. అతగాడి తీరు.. అతడి మాటలు చూస్తుంటే.. సంచలనం కోసం చేసిన బరితెగింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అంటూనే.. పూటుగా తాగటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ప్రధాన ప్రశ్న. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన తర్వాత ఆటోలకు గిరాకీ లేదన్న వాదన తెర మీదకు రావటం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ప్రజాభవన్ ఎదుట తన ఆటోకు నిప్పు పెట్టుకున్న వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ మొత్తం ఉదంతం గురించి వివరిస్తూ.. మహబూబ్ నగర్ కు చెందిన దేవ్‌లకు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధిలో భాగంగా హైదరాబాద్ వచ్చాడు. మియాపూర్ లో ఉంటున్న అతను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆటోలో ప్యాసింజర్లు సరిగా ఎక్కటం లేదని.. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు.
గురువారం సాయంత్రం ఆటోని ప్రజాభవన్ వద్దకు తీసుకొచ్చాడు. సరిగ్గా 7 గంటల వేళలో ఆటోపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. దీంతో ఆటో కాలిపోయింది. ఆటోకు నిప్పు పెట్టుకునే వేళలో.. దేవ్ల మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆటో మంటల్లో కాలే సమయంలో దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అతడ్ని పోలీసులు అడ్డుకొని కాపాడారు.
ఆటోపై నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గిరాకీ లేదని వాపోయిన దేవ్ల మాటలే నిజమని అనుకుందాం.. ఈ రోజుకు హైదరాబాద్ లో ఆటో వాళ్లను ఎవరైనా సరే.. కిలో మీటరు దూరానికి.. రెండు కిలోమీటర్ల దూరానికి వస్తావా అడిగితే.. నోటికి వచ్చిన ధరల్ని చెప్పటం తెలిసిందే. మరి.. దానికి ఏమనాలి? సంచలనం కోసం ఇలాంటివి చేసి.. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేయాలన్న తీరుకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది.