దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేయసిని 35 ముక్కలుగా నరికి అడవుల్లో విసిరేసిన ఘాతకుడు ఆఫ్తాబ్ను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అదేసమయంలో అతను శ్రద్ధాను హత్య చేసేందుకు వినియోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, శ్రద్ధా వాకర్ ను హత్య చేసిన తర్వాత ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని తనతో డేటింగ్ చేస్తున్న మరో మహిళకు ఆఫ్తాబ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా ఈకేసులో నిందితుడి చుట్టూ.. అనేక విషయాలు తిరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇది సంక్లిష్ట కేసుగా పేర్కొన్నారు.
శ్రద్ధావాకర్ మృతదేహాన్ని 35ముక్కలుగా కోసిన నిందితుడు ఆఫ్తాబ్కు ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో రెండోవిడత పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అనంతరం.. కొందరు దుండగులు ఆఫ్తాబ్ను తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌పై దాడికి యత్నించారు. ఆఫ్తాబ్ను జైలుకు తరలిస్తున్న సమయంలో కొంత మంది వ్యక్తులు.. కత్తులతో వచ్చి అతడిని చంపడానికి ప్రయత్నించారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకుని.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
గుజరాత్‌లోని సూరత్‌లో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో ఫైసల్ మొమిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి ఆఫ్తాబ్ పూనావాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని వాసైలో ఫైసల్ ఉండే ప్రదేశంలోనే అఫ్తాబ్ కూడా ఉండేవాడు. గుజరాత్ పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో ఇతడు దొరికాడు. ఇతడితో పాటు ముంబయికి చెందిన అంకిత్ షిండే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. శ్రద్ధాను హత్య చేసిన రోజు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆఫ్తాబ్ స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో ఈ డ్రగ్ డీలర్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.