తెలంగాణ ఎన్నికల వేళ.. అధికార పార్టీ బీఆర్ ఎస్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయ త్నం జరిగింది. అత్యంత సమీపం నుంచి ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పొట్టకు తీవ్రమైన కత్తి పోట్లు తగిలాయి. ఇంతలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై.. దుండగుడిని నిలువరించారు. ఈ క్రమంలో ఎంపీ గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది?
బీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. అసెంబ్లీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలను మచ్చిక చేసుకునేందుకు కీలకమైన వ్యక్తుల ఇంటికి వెళ్లి.. వారితో చర్చలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక చర్చి పాస్టర్ ఇంటికి వెళ్లిన ఎంపీ కొత్త.. ఆయనతో చర్చలు జరిపారు. ఎస్సీల ఓట్లు బీఆర్ ఎస్‌కు అనుకూలంగా పడేలా చూడాలని అభ్యర్థించారు.
అనంతరం పాస్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎంపీ కొత్త ప్రభాకర్‌ను పరిచయం చేసుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తానంటూ.. ఓ వ్యక్తి ఎంపీ భద్రతా సిబ్బందిని నమ్మించి.. దూసుకుంటూ వచ్చాడు. వచ్చీరావడంతోనే ఎంపీకి నమస్కారం పెడుతూ.. చేతిలో ఉన్న కత్తితో ఆయన పొట్ట భాగంలో రెండు పోట్లు పొడిచాడు. దీంతో ఎంపీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఎంపీ భద్రతా సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని నిందితుడిని పట్టుకున్నారు.
కానీ, ఎంపీపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని దౌల్తాబాద్‌కు చెందిన రాజాగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్నిఅదుపులోకి తీసుకుని హత్య కోణంలో విచారణ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఎంపీపై కత్తితో దాడి ఘటనను తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. వెంటనే ఆయనను హైదరాబాద్కుతరలించి వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.