పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలిద్దరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోసేశారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఆ ఘటనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు బలమైన గాయమైందని, బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజ్ పుత్ గాయపడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.
ఢిల్లీ పోలీసులకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మరికొందరు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని అనురాగ్ ఠాకూర్ అన్నారు. మరోవైపు, బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీలు కూడా కేసు పెట్టారు. కుట్రపూరితంగా తమపై కేసు పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ ఎంపీలు కలిసి…బీజేపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు తోసివేయడంతో కిందపడి తన మోకాలికి గాయమైందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు.
తమ పార్టీ ఎంపీలను, తనను కర్రలతో బీజేపీ ఎంపీలు పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, తమను తోసేయడంతోనే బీజేపీ ఎంపీ కిందపడ్డారని రాహుల్ గాంధీ అన్నారు. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి, బీజేపీ ఎంపీల మధ్య జరిగిన తోపులాట ఈ ఘటనకు దారి తీసింది.