టీడీపీ నేత పట్టాభితో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయం, రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. పట్టాభితో పాటు టీడీపీ కార్యాలయాలపై దాడులను టీడీపీ అధినతే నారా చంద్రబాబు నాయుడితోపాటు, టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని లోకేష్ ఆరోపించారు. తమ నేతలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ…టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పోలీసులతో లోకేష్ నిన్న వాగ్వాదానికి దిగారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా లోకేష్ పై కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారన్న ఆరోపణతో లోకేష్ తో పాటు మరో ముగ్గురు టీడీపీనేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో A1గా లోకేష్, A2గా అశోక్‌బాబు, A3గా ఆలపాటి రాజా, A4గా తెనాలి శ్రావణ్ పేర్లు చేర్చారు. అంతేకాదు, వారిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు 70 మంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిన్న వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ టీడీసీ సిబ్బందిని కార్యాలయంలోకి తీసుకువెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. అంబులెన్స్‌లో వస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు గేటు బయటే అడ్డుకోవడంతో ఆగ్రహించిన లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు వైసీపీ కండువా కప్పుకోవాలంటు మండిపడ్డారు. అంబులెన్స్ కు దారి వదలాలని, పోలీసులు పక్కకు తప్పుకోవాలని లోకేశ్ కన్నెర్ర చేశారు. ఓ దశలో పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోెలీసుల తీరుకు నిరసనగా లోకేష్ రోడ్డుపై బైఠాయించి ధర్నాకి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు చేసేదేమీలేక పోలీసులు అంబులెన్స్‌కి దారిచ్చారు.
మరోవైపు, గాయపడిన కార్యకర్తలను లోకేశ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన వారిని పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే 20 మందికి గాయాలు కావడం తనను కలచివేసిందన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, 16 మందికి స్వల్పగాయాలయ్యాయి. లోకేశ్ తో పాటు చంద్రబాబు కూడా వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.