టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ముదివీడు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లులో పోలీసులపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో చంద్రబాబుతోపాటు 20 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదైంది, ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులపై పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా దేవినేని ఉమ తదితరులపై కేసు నమోదైంది.
చంద్రబాబు, ఉమలతోపాటు పులివర్తి నాని, శ్రీరాం చిన్నా తదితరరులపై ముదివీడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. చంద్రబాబు ప్రోత్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఐరన్ రాడ్లు, మారణాయుధాలు, కర్రలు, రాడ్లు, ఇటుకలతో తమపై దాడి చేశారని ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదైంది. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలపై కేసు నమోదు చేయడాన్ని పలువురు టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేసి తమపైనే కేసు పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె చెందేవరకు పోరాటం ఆపబోమని అంటున్నారు.