టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, పట్టాభిపై దాడి ఘటనతో ఈ దాడుల పర్వం ఆగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న వైనం సంచలనం రేపుతోంది. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం కలకలం రేపింది. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లాయని,. కార్యాలయంలో కనపడినవారిపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపై కూడా వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ కార్యాలయాలపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలేనని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు బయల్దేరారు.పట్టాభి ఇంటి, టీడీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన చంద్రబాబు….కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్‌షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ దాడుల విషయం తన దృష్టికి రాలేదని అమిత్ షా తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్‌షా హామీ ఇచ్చారు. టీడీపీ నేత పట్టాభి, టీడీపీ కార్యాలయాలపై దాడులతో ఏపీలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.