ఎడాపెడా ఆలయాలపై దాడులు
వరుసగా దేవతా విగ్రహాల ధ్వంసం
ఇప్పటికీ దొరకని దోషులు
అసమర్థత కాదు.. నిస్సహాయతే కారణం
శ్రీశైల మఠంలో తవ్వకాలు జరిపిన కేసులోఒకరికి వైసీపీ నేత అండ
బెజవాడలో నేటికీ తేలనివెండి రథం సింహాల సంగతి
ఆంజనేయుడి విగ్రహం పెకలించినకేసులో నిందితుడు రెండోరోజే విడుదల
అంతర్వేది రథం దహనం సీబీఐకి!
రామతీర్థం కేసు దర్యాప్తు సీఐడీకి
చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వం
‘అర్ధరాత్రి, చీకట్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఇది పొలిటికల్ గెరిల్లా యుద్ధం’’… అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతున్నారు! తప్పుడు పనులు అర్ధరాత్రే చేస్తారు. మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలనే ఎంచుకుంటారు. అర్ధరాత్రి మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నందునే.. పోలీసులు నిందితులను పట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. గుప్తనిధుల కోసం జరిగే తవ్వకాలు, ఆలయాల్లో దొంగతనాలు తరచూ జరిగేవే. కానీ.. ఇప్పుడు జరుగుతున్నది వేరు.
ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రాముడి విగ్రహం తలను వేరు చేయడం, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం వంటి ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం దోషులను పట్టుకోలేకపోతున్నారు. వారి శక్తిసామర్థ్యాలు చాలడం లేదా? లేక ఆ శక్తిని మరేదైనా శక్తి అడ్డుకుంటోందా?దేశంలోనే అద్భుతమైన టెక్నాలజీ వాడుతూ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సొంతం!
ఈ విషయాన్ని ఆ శాఖ పెద్దలు పదేపదే ఘనంగా ప్రకటించుకుంటూ ఉంటారు. అంత గొప్ప టెక్నాలజీ, సామర్థ్యం ఉన్న పోలీసులు ఆలయాలపై దాడులు చేసిన వారిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ఈ కేసుల విషయంలో ‘కనిపించని నాలుగో సింహం’పై.. పైకి కనిపించని ఏవో ఒత్తిళ్లు పని చేస్తున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. భక్తులు, పూజార్లు, హిందూ సంఘాలు, సాధువులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా విగ్రహాల విధ్వంసం ఆగకపోవడానికి.. పోలీసుల చేతకానితనం కారణం కాదని, ఈ విషయంలో వారు ‘నిస్సహాయులు’గా మారడమే అసలు కారణమనే అనుమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఆధారాలు చూపించినా గప్‌చుప్
శ్రీశైలం మఠంలో గుప్తనిధుల కోసం తవ్వకాలకు సంబంధించిన కేసులో పోలీసులు ఒక అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సిన వ్యక్తి! ‘‘శివలింగం పెకలించిన ఘటనలో అతను ఉంటే రాజీనామా చేస్తా’’ అని అధికార పార్టీ నేత సవాల్ విసిరారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కేసు నుంచి ఆ వ్యక్తిని తప్పించారు. దీంతో… శివాలయంలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆ అన్యమత నేత వీడియోను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు.
అయినా… పోలీసులు గప్‌చుప్! పైగా… వీడియో విడుదల చేసిన బీజేపీ నేతనే పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోనే ఇటీవల కోసిగి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ గోపురంపైన ఉన్న విగ్రహాల పెచ్చులూడి కిందపడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని కొట్టేశారని, హుండీ కూడా చోరీ చేసే ప్రయత్నం జరిగిందని స్వయంగా పూజారే తెలిపారు. విచిత్రమేమిటంటే… పోలీసులు పూజారిని, ఆలయ ధర్మకర్తతోపాటు ఈ విషయాన్ని వాట్సప్‌లో షేర్ చేసిన విలేకరులను కూడా అర్ధరాత్రి దాకా నిర్బంధించి, ఆ తర్వాత వాళ్లపై కేసు పెట్టారు. ఒకవేళ విగ్రహాలు వాటంతట అవే దెబ్బతిని ఉంటే అదే విషయం చెప్పాలి. పూజారిపైనా, విలేకరులపైనా కేసు పెట్టడమెందుకని ఆరా తీస్తే.. స్థానిక ప్రజాప్రతినిధి ‘ఆదేశాలే’ దీనికి కారణమని తెలిసింది.
దుర్గమ్మ రథ సింహాలు ఎక్కడ?
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దొంగలు అర్ధరాత్రి ఎత్తుకుపోయి ఉండొచ్చుకానీ… జరిగిన ప్రాంతం మాత్రం ఏ మారుమూలనో లేదు. విషయం బయటికి రాగానే.. ‘లాక్‌డౌన్‌కు ముందే, తెలుగుదేశం హయాంలోనే విగ్రహాలు పోయాయ్’ అని అధికార పార్టీ నేతలు తేల్చేశారు. ఆ తర్వాత.. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా వెండి రథానికి సింహాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
రామతీర్థం ఘటనలో ‘తీవ్రంగా స్పందించిన’ ప్రభుత్వం ఆలయ ధర్మకర్త పదవి నుంచి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును అప్పటికప్పుడు తప్పించేసింది. కానీ దుర్గమ్మ వెండి రథాల చోరీపై ఇలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ఇక పోలీసుల విషయానికొస్తే.. గతంలో ఇదే విజయవాడలో కిలోల కొద్ది బంగారం పోయినప్పుడు, 8 రాష్ట్రాల్లోని దొంగలను ఇట్టే పట్టేశారు. ఇప్పుడు దుర్గమ్మ ఆలయ రథ వెండి సింహాల చోరీ కేసులో దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
పట్టపగలు కదా… పట్టుకున్నారు!
లక్షలాది మందికి ఇలవేల్పు అయిన అంతర్వేది నృసింహస్వామి ఆలయ రథాన్ని ఎవరో తగులబెట్టారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బహుశా.. ప్రభుత్వ పెద్దల వాదన ప్రకారం, అర్ధరాత్రి జరిగిన ఘటన కావడంతో పోలీసులు ఈ ఘటనకు అసలు కారణమేమిటో కనుక్కోలేకపోయారు. అయితే.. రథం దహనం ఘటనపై భారీ ఆందోళనలు జరిగాయి. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు రెచ్చిపోయి రాళ్లు రువ్వడంతో ఒక చర్చికి చెందిన కిటికీల అద్దాలు పగిలాయి. ఇది పగటిపూట జరిగిన ఘటన కదా..!
పోలీసులు నిందితులను చకచకా గుర్తించారు. 40 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఏడెనిమిది సెక్షన్ల కింద కేసు పెట్టి రిమాండుకు పంపించారు. పద్నాలుగు రోజుల తర్వాతే వీరికి బెయిలు వచ్చింది. మరి.. అంతర్వేది ఆలయ రథం సంగతేంటని ప్రశ్నిస్తే తేనెటీగల కారణంగా తగులబడిందని పొంతనలేని సమాధానమిచ్చారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి తాము తప్పుకొన్నారు. సీబీఐ ఇంతవరకు రంగంలోకి దిగిన దాఖలాలే లేవు. నెల్లూరులో రంగనాథస్వామి ఆలయం కూడా ఊరికి దూరంగా, జన సంచారం లేని ప్రాంతంలో లేదు.
అక్కడ రథం తగలబడినప్పుడు.. ఎవరో పిచ్చోడు చేశాడని తేల్చేశారు. అసలైన బాధ్యుడిని మాత్రం గుర్తించలేక పోయారు. రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా స్థలాల రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా… విధ్వంసాలు మాత్రం ఆగడంలేదు. ‘ఇది ప్రతిపక్షం కుట్ర’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ… పోలీసులు ఇప్పటిదాకా ఒక్కరినీ ఆధారాలతో అరెస్టు చేయలేదు. అంతర్వేది కేసును రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐకి అప్పగించింది. రామతీర్థం కోదండరాముడి విగ్రహం తల నరికిన కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఆ వ్యవహారంలో స్థానిక టీడీపీ నేతలను ఇరికించేందుకు సీఐడీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది.