చెదురుమదురు ఘటనల మినహా ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనుకుంటున్న తరుణంలో గుంటూరులో జరిగిన అనూహ్య ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ ఎంపీ, వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల రెడ్డిపై దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మోదుగుల ప్రయాణిస్తున్న కారు, ఆయన వెంట ఉన్న మరో కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.
ఈ దాడిలో కార్ల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో, గుంటూరు నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు నగరంలో పలుచోట్ల వైసీపీ నేతలు రిగ్గింగుకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ బూతుల్లో దౌర్జన్యానికి దిగారని, ఏజెంట్లను బెదిరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే గుంటూరులోని జేకేసీ కాలేజీలోని పోలింగ్ స్టేషన్ కు మోదుగులు వెళ్లారు.
దీంతో, పోలింగ్ స్టేషన్ లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయిస్తున్నారన్న భావనతో మోదుగులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. పోలీసులు ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం జేకేసీ కాలేజీ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్కడున్న వారందరినీ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
దీంతోపాటు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చెలరేగగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ రకంగా చెదురుమదురు ఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు అంటున్నారు. కాగా, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. దాదాపుగా 60-65 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.