గతంలో ఏపీలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజుల క్రితం ఏపీలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యలోనే నిన్న అర్ధరాత్రి పోలీసులు….నర్సీపట్నం నుంచి వచ్చి ఆనందబాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆనందబాబుకు నోటీసులివ్వడంపై టీడీపీ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఘాటుగా స్పందించారు.
అర్థరాత్రి పూట దొంగలు తిరిగే సమయంలో పోలీసులు నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చి ఆనందబాబుకు నోటీసులివ్వడం ఆశ్చర్యం కలిగించిందని పట్టాభి అన్నారు. అన్ని విషయాల్లోనూ ఇదే మెరుపువేగంతో పోలీసులు స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు. నర్సీపట్నంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు నిఘా పెట్టాలని, అత్యాచారాలు, దళితులపై దాడులు జరిగితే మెరుపు వేగంతో స్పందించని పోలీసులు..ఆనందబాబు విషయంలో వేగంగా స్పందించారని దుయ్యబట్టారు.
తాడేపల్లి పాలేరు చెప్పినట్టు, ఆ ప్యాలెస్ లో ఉండే పబ్జి దొర చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందబాబు వైసీపీ నేతల్లా పిత్తపరిగలు ఏరుకునే బ్యాచ్ కాదని, ఆయనో ఉద్యమ నాయకుడని పట్టాభి షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే పట్టాభి నివాసంపై తాజాగా దాడి జరిగింది. దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు పట్టాభి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్, విలువైన వస్తువులు, కారు అద్దాలు ధ్వంసం చేశారు.
దాడి సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న పట్టాభికి దాడి విషయాన్ని…పట్టాభి భార్య, కూతురు ఫోన్ చేసి చెప్పారు. కొద్ది గంటల క్రితం వైసీపీ నేతలపై పట్టాభి చేసిన విమర్శల నేపథ్యంలోనే పట్టాభి ఇంటిపై వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు, పట్టాభి ఇంటిపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు.