శతృదుర్భేధ్యంగా నిర్మించామని.. ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్పుకొన్న భారత పార్లమెంటుపై దాడి జరిగింది. విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చిన ఇద్దరు ఆగంతకులు.. అకస్మాత్తుగా అక్కడ నుంచి సభ్యుల మధ్యకు దూకి.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే సభ మొత్తం గ్యాస్ ఆవరించేసింది.
దీంతో సభలో సభ్యులు.. తలోదిక్కుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం గమనార్హం. మరోవైపు.. అలెర్టయిన.. పార్లమెంటు రక్షణ సిబ్బంది.. ఆగంతుకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు ఎక్కడ నుంచి వచ్చిందీ.. ఎందుకు వచ్చిందీ.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలకమైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
ఇంత కీలక సమావేశాల నేపథ్యంలోనే ఇటీవల డిసెంబరు 13లోగా పార్లమెంటుపై దాడి చేస్తామని.. కొందరు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిని లైట్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఈ రోజు ఉదయం యథాలాపంగానే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చిన వారిలో ఇద్దరు అనూహ్యంగా సబలోకి ఒక్క ఉదుటున దూకేశారు.
ఆగంతుకుల కాలి బూట్లకు అమర్చిన ప్రత్యేక యంత్రాల ద్వారా.. టియర్ గ్యాస్‌ను వదిలేశారు. దీంతో సబలో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను వెంటనే వాయిదా వేశారు. ప్రధాన ద్వారాలను మూసివేశారు. కాగా.. ఇదే నెల ఇదే రోజు గతంలోనూ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడిచేయడం గమనార్హం.