దేశ వ్యాప్తంగా లోక్ సభలోనూ.. వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లోనూ ఖాళీగా ఉన్న స్థానాల్ని భర్తీ చేసేందుకు వీలుగా ఉప ఎన్నికల నిర్వహణ కోసం తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 6 రాష్ట్రాల్లోని మూడు లోక్ సభ స్థానాలు.. ఏడు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.
ఇందులో ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఒకటి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు షాకింగ్ గా మారటం తెలిసిందే.
మంచితనానికి.. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా వ్యవహరించే ఆయన తీరు ఉండటంతో గౌతమ్ మరణం అందరిని కలిచివేసింది. ఇక.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 30న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6 కాగా.. నామినేషన్ల పరిశీలన.. ఉప సంహరణ కార్యక్రమాల్ని ముగించి..కీలకమైన పోలింగ్ ను జూన్ 23న నిర్వహిస్తారు. పోలింగ్ ఫలితాల్ని జూన్ 26న విడుదల చేస్తారు. జూన్ 28తో ఎన్నికల షెడ్యూల్ ముగియనుంది.
ఇక.. ఈ ఉప పోరు విషయానికి వస్తే.. మేకపాటి గౌతమ్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో.. ఏ రాజకీయపార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉండదనే చెబుతున్నారు. మేకపాటి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి వైసీపీ టికెట్ ఇస్తారని చెబుతున్నారు. దాదాపుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడికే టికెట్ దక్కనుంది. ఈ నేపథ్యంలో విపక్ష టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదంటున్నారు.
ఉప పోరు షెడ్యూల్ విషయానికి వస్తే
మే 30 ఎన్నికల నోటిఫికేషన్
జూన్ 6 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జూన్ 7 నామినేషన్ల పరిశీలన
జూన్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
జూన్ 23 పోలింగ్
జూన్ 26 ఓట్ల లెక్కింపు.. ఫలితం వెల్లడి
జూన్ 28 ఉప ఎన్నికల షెడ్యూల్ ముగింపు
ఏపీలోని ఆత్మకూరుతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప పోరు ఎక్కడెక్కడంటే
లోక్ సభ స్థానాలు
– ఉత్తరప్రదేశ్ లో (2) రాంపూర్.. అజాంఘర్
– పంజాబ్ (1) సంగ్రూర్
అసెంబ్లీ స్థానాలు
త్రిపుర (4) అగర్తల.. టౌన్ బోర్డోవళి.. సూర్మా.. జుబరాజ్ నగర్
ఏపీ (1) ఆత్మకూరు
ఢిల్లీ (1) రాజిందర్ నగర్
జార్ఖండ్ (1) మాందార్