యూపీలో యోగి జమానాలో సంచలనాల మీద సంచనాలు నమోదవుతున్నాయి. ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ కొడుకును మొన్నీ మధ్యనే ఎన్ కౌంటర్ లో లేపేసిన సంచలనం సర్దుమణగక ముందే.. తాజాగా సదరు గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాప్ అహ్మద్ లు ఇద్దరిని అందరి ఎదుట కాల్చి చంపేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. జైలు నుంచి మెడికల్ చెకప్ కు తీసుకెళుతుండగా ఈ షాకింగ్ సీన్ చోటు చేసుకుంది.
ఇంతకీ ఈ ఉమేశ్ పాల్ ఎవరు? అతడ్నిచంపేసిన ఉదంతంలో సంచలన పరిణామాలు వరుస పెట్టి చోటు చేసుకోవటం గమనార్హం. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేశ్ పాల్. అతడ్ని ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురయ్యారు. అతనితో పాటు.. ఇద్దరు అంగరక్షకుల్ని హంతకులు పట్టపగలు కాల్చి చంపిన వైనం యూపీలో సంచలనంగా మారింది. ఉమేశ్ పాల్ హత్యకు సంబంధించిన సీసీ పుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉమేశ్ హత్య నేపథ్యంలో అతడి సతీమణి జయపాల్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఈ హత్యలో మాజీ ఎంపీ కమ్ గ్యాంగ్ స్టర్ గా పేరున్న అతీక్ అహ్మద్ అతడి సోదరుడు అష్రఫ్ లు.. ఇద్దరుకుమారులు.. మరో ఇద్దరు అనుచరులతో పాటు ఇంకో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ హత్య తర్వాత అసద్.. అతీక్ అనుచరుడు గుల్హామ్ లు మిస్ అయ్యారు. వీరి కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టిన పోలీసులు.. వీరి తలపై రూ.5 లక్షలు చొప్పున రివార్డును ప్రకటించారు.
ఈ క్రమంలో వీరిద్దరూ ఝూన్సీలో ఉన్నారన్న పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. కానీ.. అనూహ్యంగా ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసులో ఇప్పటికే ఒక షార్ప్ షూటర్ ను మరో నిందితుడ్ని కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కోర్టు విచారణకు హాజరైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్.. అతడి సోదరుడు అష్రాఫ్ లకు.. అతీక్ కొడుకు ఎన్ కౌంటర్ అయినట్లుగా సమాచారం అందటంతో కోర్టులో విలపించాడు.
ఇదిలా ఉండగా తాజాగా అతీక్ అహ్మద్ ను.. అతడి సోదరుడు ఇద్దరిని తీసుకొని ఆసుపత్రిలో మెడికల్ చెకప్ కు హాస్పిటల్ కు తీసుకెళుతున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి వేళ.. మీడియా ప్రతినిధుల మధ్య నుంచి ఒక వ్యక్తి పిస్టల్ తో వరుస కాల్పులు జరిపారు. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో అందరూ చూస్తుండగానే.. తోపు గ్యాంగ్ స్టర్ గా పేర్కొనే అతీక్ అహ్మద్.. అతడి సోదురుడ్ని ఇంత షాకింగ్ గా లేపేసిన వైనం పెను సంచలనంగా మారింది. మొత్తంగా ఉమేశ్ పాల్ హత్య కేసుతో సంబంధం ఉన్న వారంతా ఒక్కొక్కరుగా హత్యకు గురి కావటం సంచలనంగా మారింది.