ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఉన్న పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం(ఈరోజు) మౌని అమావాస్య పుణ్య తిథి కావడంతో పవిత్ర స్నానాల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి 15 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మౌని అమావాస్యరోజు స్నానం చేయడం ద్వారా మోక్షం పొందొచ్చన్న పురాణోక్తి నేపథ్యంలో భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.
బుధవారం తెల్లవారు జామున 2 గంటల నుంచే ఘాట్లకు భక్తులు పోటెత్తారు. కొందరు రోజుల తరబడి ఘాట్లకు సమీపంలో ఏర్పాటు చేసిన గుడారాలలోనే ఉంటున్నారు. మౌని అమావాస్య ఘడియలు ప్రారంభమైన బుధవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి స్నానం కోసం భక్తులు ఒక్కసారి గా ఎగబడ్డారు. దీంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుని వందల మంది భక్తులు ఘాట్లపై పడిపోయారు. మరికొందరు నీటిలో పడిపోయారు.
ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందారని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ ఘటన విష యం దావాలనంలా వ్యాపించింది. జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా మహాకుంభమేళాలో తిష్టవేసి న నేపథ్యంలో నిమిషాల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసింది. అయితే.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని..అధికారులు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం సహా మంత్రులు తెలిపారు.
మోడీ ఆరా..
మౌని అమావాస్య నేపథ్యంలో భక్తులు పోటెత్తడంతో చోటు చేసుకున్న తొక్కిసలాట.. మృతుల విషయం పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం తెల్లవారు జామునే స్పందించారు. సీఎం యోగితో రెండు మూడు దఫాలు ఆయన పోన్ చేసి విషయంపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపా రు. వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, మృతి చెందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు.