‘‘శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట’’ వెనుకటికి ఒకడు. సెలబ్రిటీల జాతకాల్ని అదే పనిగా చెబుతూ.. వార్తల్లో నిలిచే జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణుస్వామి నోటి నుంచి మాటలు వింటే ఒళ్లు మండాల్సిందే. జ్యోతిష్యశాస్త్రం మీద కాస్త గౌరవ మర్యాదలు ఉన్నా.. శుభం పలకటానికే తప్పించి.. అశుభం పలికేందుకు తెగ ఇబ్బంది పడే వారికి భిన్నంగా వేణుస్వామి తాజా వ్యవహారశైలి ఉందని చెప్పాలి.
సినీ హీరో నాగచైతన్య.. నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ జరిగిందంటూ యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి ఇంకా ఇరవై నాలుగు గంటలు కాలేదు. అప్పుడు వేణుస్వామి ఈ మ్యాటర్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి అందరూ మాట్లాడుకునే వేళలో.. వేణుస్వామి మిగిలిన వారికి భిన్నంగా వారి పెళ్లి పెటాకుల మీద నోరు పారేసుకున్నారు. నిజానికి.. నాగచైతన్య.. శోభితాల ఎంగేజ్ మెంట్ మాత్రమే జరిగింది తప్పించి పెళ్లి జరిగింది లేదు. ఈ శ్రావణమాసంలో వీరి పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు.
ఇలాంటి వేళలో.. వేణుస్వామి ఎంట్రీ ఇచ్చి.. ఇరువురి జాతకం బాగోలేదంటూ కామెంట్స్ చేశారు. సమంత కంటే శోభిత జాతకం ఏ మాత్రం బాగోలేదని.. 2027 వరకు బాగానే ఉన్నా.. మూడేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య ఒక స్త్రీ కారణంగా గొడవలు.. సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.
అంతేకాదు.. వీరి ఎంగేజ్ మెంట్ చేసుకున్న ముహుర్తం కూడా బాగోలేదని.. వారిద్దరు కలిసి ఉండలేరని.. కఛ్చితంగా విడిపోతారని పేర్కొన్నారు. వీరి ఎంగేజ్ మెంట్ ఉత్తర నక్షత్రంలో జరిగిందని.. నాగ చైతన్య రాశి కర్కాటక రాశిగా.. శోభితది ధనుస్సురాశిగా పేర్కొన్నారు. తాను కావాలని.. తెలియకుండా చెప్పటం లేదని.. తాను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఒకవేళ..ఆయన అనుకున్నదే నిజమని అనుకుందాం. ఆ విషయాన్ని నాలుగు గోడల మధ్య వారికే చెప్పి ఉండొచ్చు. దానికి ఓపెన్ గా చెప్పేయటం.. శుభమా అని పెళ్లి వేళ.. అశుభపు మాటలు అవసరమా? అని పలువురు తిట్టి పోస్తున్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో గెలవరని.. పవన్ కల్యాణ్ చేతిలో పవర్ ఉండదన్న మాట చెప్పిన ఈ పెద్ద మనిషి.. ఎన్నికల్లో గెలుపు తర్వాత కవరింగ్ మాటలు చెప్పేసి చేతులు దులిపేసుకోవటం తెలిసిందే. అందుకే.. వేణుస్వామి జాతకాన్ని పట్టించుకోకుండా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.