ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వ్యవహారం ఇరు తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దు తదుపరి విచారణ నేపథ్యంలో జగన్ కు బెయిల్ వస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఆ రోజు విచారణలో కోర్టు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముందని తెలుస్తోంది. ఓ పక్క బెయిల్ రద్దు టెన్షన్ తో ఉన్న జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేయడంతో షాక్ తగిలినట్లయింది.
సెప్టెంబర్ 22న జరిగే వాన్పిక్ ఈడీ కేసు విచారణకు హాజరుకావాలని జగన్ కు సీబీఐ, ఈడీ ఆదేశాలు జారీ చేయడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. న్యాయస్థానం విచారణకు స్వీకరించడంతో జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరు మూడో వారంలో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ ముహూర్తం పెట్టడం చర్చనీయాంశమైంది. వర్షాకాల సమావేశాలను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
వాన్ పిక్ కేసులో సెప్టెంబర్ 22వ తేదీన జరగనున్న విచారణకు జగన్ హాజరు కావాల్సిన సమయంలోనే సమావేశాలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో, కరోనా పేరు చెప్పి బడ్జెట్ సమావేశాలను ముచ్చటగా మూడు రోజులకే మొక్కుబడిగా లాగించేసిన జగన్…ఇపుడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వర్షపు ముసురులాగా వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని నిర్ణయించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఇది జగన్ మాస్టర్ స్ట్రోక్ అని, జగన్ ది పెద్ద ప్లానింగ్ అని నెటిజన్లు మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. జగన్ ది మామూలు బుర్ర కాదని, ఇప్పటికే ప్రతి శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టిన జగన్…ఇలా కోర్టు విచారణలకు బంప్ కొట్టడంలో ఆరితేరిపోయారని సెటైర్లు వేస్తున్నారు. ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దయితే బాగుంటుందని, అపుడు సెప్టెంబరు 22, అసెంబ్లీ సమావేశాల టెన్షన్ ఉండదని పంచ్ లు వేస్తున్నారు. మరి, ఈ సెటైర్లపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.