జగన్ సర్కార్ పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల జగన్ పాలనలో తిరుపతి సర్వనాశనం అయిందని ఆయన విమర్శలు గుప్పించారు. తిరుపతిలో జరిగే అన్యాయాలను ఊహింలేమని, ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదంటూ అశ్వనీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదంటూ మదనపడ్డారు.
తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారం వెయ్యికాళ్ల మండపాన్ని చంద్రబాబు హయాంలో తొలగించారని, కానీ ఆ విషయంలో నాడు చినజీయర్ స్వామి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. కానీ, ఇపుడు చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని అశ్వినీదత్ నిలదీశారు. ఏపీలో బలవంతపు మత మార్పిడిలు జరుగుతుంటే చినజీయర్ స్వామి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకుందన్నారు.
జగన్ ను చిన జీయర్ స్వామి దైవాంశ సంభూతుడని పొగిడిన మాటలు వింటే కడుపు మండిపోయిందని అశ్వనీదత్ అన్నారు. సమ్మక్క- సారక్కలను చినజీయర్ దేవతలు కాదనడం తనను ఎంతో బాధించిందని అన్నారు. సమ్మక్క-సారక్కలంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందని, పొరుగు రాష్ట్రాల్లో సమ్మక్క- సారక్కలను దేవతలుగా నమ్ముతారని, దేశం నలుమూలల నుంచి ఆ జాతరను చూసేందుకు జనం వస్తారని గుర్తు చేశారు.
సినీ రంగ సమస్యలపై కూడా అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంలతో మాట్లాడి కొందరు టికెట్ రేట్లు పెంచుకున్నారని, ఆ రేట్లు పెరగకముందే ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారని అన్నారు. కొందరు గొలుసుకట్టు థియేటర్లను తీసుకుని వాళ్లే సమోసాలు, కూల్ డ్రింకులు అమ్ముకుంటూ, రేట్లు భారీగా పెంచేశారని, దాంతో ఫ్యామిలీతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు విరక్తి పుట్టించారని అశ్వనీదత్ షాకింగ్ కామెంట్లు చేశారు.
థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసుకుంటూ పోతే సినిమాలు తీయడం కూడా కష్టమైపోతుందని, హీరోలకు ఎవరిష్టం వచ్చినంత పారితోషికం వారు ఇస్తున్నారని, దాని వల్లే టికెట్ రేట్లు పెరిగాయన్న వాదన సరికాదని అన్నారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏం సాధించడానికి వచ్చిందో తెలియదని అశ్వనీదత్ విమర్శనాత్మకంగా స్పందించారు.
Comments 1