కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరిని ఈ మధ్యన డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకోవటం.. అనంతరం అతడి ఫోన్ లోని సమాచారంతో డ్రగ్స్ లింకుల్ని చేధించేందుకు పోలీసులు రంగంలోకి దిగటం తెలిసిందే. ఈ క్రమంలో అతడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా కేపీ చౌదరికి సినీ నటి ఆషూరెడ్డి వందల సంఖ్యలో కాల్స్ చేయటాన్ని పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె పేరుతో పాటు మరికొందరి పేర్లు వెల్లడయ్యాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టు ద్వారా ఆషూరెడ్డి స్పందించారు. మీడియాకు చెందిన కొన్ని వర్గాల్లో తన పేరు వైరల్ అవుతుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆమె.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న ఆమె.. మీడియాలో పేర్కొన్నట్లుగా తనకు ఎవరితోనూ డ్రగ్స్ సంబంధాలు లేవని స్పష్టం చేసింది.
తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ఆమె.. విచారణకు తాను సిద్ధమని పేర్కొన్నారు. తనకు తెలిసిన వాస్తవాల్ని అధికారులకు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబరును బహిరంగంగా ప్రదర్శిస్తే మాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. పోలీసుల కస్టడీ వేళ కేపీ చౌదరి.. ఆషూ రెడ్డి పేరును చెప్పలేదని.. ఆమెకు సంబంధించిన ఏ వివరాల్ని వెల్లడించలేదన్నది సమాచారం. అయితే.. ఈ ఉదంతంలో ఆమెకు సంబంధించిన ఆధారాలు లభిస్తే మాత్రం.. ఆమెను విచారణకు పిలుస్తామని పేరు వెల్లడించటానికి ఇష్టపడని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.