ఇప్పుడు మనకు ప్రభుత్వం చాలా అవసరం, ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రభుత్వ లేదు. ఇప్పుడు దేశంలో గాలి కూడా దొరకడం లేదు. మనుషులు చచ్చి పోతున్నారు. సహాయం చేసే వాళ్ళు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకునే వ్యవస్థలు నిర్వీర్యం చేయబడ్డాయి.
ఇప్పటికిప్పుడు…
ఏం చేయాలి?
2024 వరకు ఆగలేము.
నాలాంటి ఒక వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసే రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసే బదులు జైలుకు వెళ్ళడానికి నేను ఇష్టపడతాను, ఇంతకుముందు వెళ్ళాను కూడా.
కానీ ఈ రోజు…
మనం
ఇళ్లల్లో
వీధుల్లో
ఆసుపత్రులలో
ఆసుపత్రుల పార్కింగ్‌లో
చిన్న గ్రామాలలో
పట్టణాలలో
పెద్ద పెద్ద నగరాలలో
వ్యవసాయ క్షేత్రాలలో…… పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితిలో…….
లక్షలాదిమంది నాతోటి పౌరులతో కలిసి….
అడుగుతున్నాను….
నరేంద్ర మోడీ గారు
దయచేసి ప్రధాని పదవి నుండి తప్పుకోండి.
ఇది నువ్వు సృష్టించిన సంక్షోభం… ఈ సంక్షోభాన్ని ఇంకా పెంచగలదు కానీ…
నువ్వు పరిష్కారం చూపించలేవు.
మీరు పెంచి పోషించిన అజ్ఞానం వల్ల, ద్వేషం వల్ల, భయానక వాతావరణం వల్ల ఈ వైరస్ ఇంకా పెరుగుతూనే ఉంది.
ప్రశ్నించిన వాళ్లపై మీరు ఉక్కుపాదం మోపడం వల్ల ఈ వైరస్ పెరుగుతూనే ఉంది.
జాతీయ మీడియా మీ నియంత్రణలో ఉండి, కేవలం అంతర్జాతీయ మీడియా మాత్రమే నిజాలు చూపించినంత కాలం ఈ వైరస్ పెరుగుతూనే ఉంటుంది.
ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేని
ఒక ప్రధానమంత్రి తన పదవీ కాలంలో ఒక్కసారి కూడా… కనీసం ప్రస్తుత భయానక పరిస్థితులలో కూడా… మీడియా సమావేశం నిర్వహించనంతకాలం ఈ వైరస్ పెరుగుతూనే ఉంటుంది.
మీరు ప్రధాని పదవి నుంచి తప్పకపోతే, మాలో వందలు, వేల మంది అనవసరంగా చనిపోతారు.
కాబట్టి… దయచేసి తప్పుకోండి.
సర్దుకొని వెళ్లిపోండి. గౌరవంగా వెళ్లిపోండి.
ధ్యానం చేసుకుంటూ, ఒంటరిగా సంతోషంగా జీవించండి. మీరు ఇంత ముందు చెప్పినట్టు మీరు కోరుకుంటున్న జీవితం కూడా అదే.
ఇలా వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు కూడా ప్రశాంతంగా బతకలేరు.
ప్రధానమంత్రి పదవిని నిర్వహించగలిగే వాళ్లు మీ పార్టీలో చాలామంది ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ ఆమోదంతో మీ పార్టీలో ఏ నాయకుడైనా ఈ సంక్షోభాన్ని నివారించడానికి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలి. దాంతోపాటు ఈ సంక్షోభం నివారణకు అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు కూడా అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక సంక్షోభ నివారణ కమిటీ ని ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉన్న జాతీయ పార్టీ కాబట్టి, ఆ కమిటీ లో ఉండాలి.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు శాస్త్రవేత్తలు, వైద్యరంగ నిపుణులు, పాలనా అనుభవం ఉన్నవారు ఆ కమిటీ లో ఉండాలి. ఇలాంటి సమిష్టి ఇ కార్యనిర్వహణ గురించి మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు.
ప్రతిపక్షం లేనప్పుడు నియంతృత్వం రాజ్యమేలుతోంది.
ఇప్పటికే మన దేశంలోని ఈ సంక్షోభాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా చాలా మంది చూస్తున్నారు, మీరు పదవి నుంచి తప్పుకున్న పోతే, ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం, ప్రపంచ సంక్షోభంగా మారవచ్చు, ఈ సంక్షోభాన్ని నివారించలేని మీ అసమర్థత కారణంగా, మన అంతర్గత వ్యవహారాలలో ప్రపంచ దేశాల జోక్యం న్యాయసమ్మతం అవుతుంది. అదే జరిగితే, భారతదేశ స్వతంత్ర పోరాటం వృధా అయ్యి, మన దేశం మళ్లీ ఒక వలస రాజ్యం గా మారే అవకాశం ఉంది. దయచేసి దీన్ని తేలిగ్గా తీసుకోకండి.
కాబట్టి
దయచేసి తప్పుకోండి.
ఇప్పుడు ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం మీ బాధ్యత.
ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు మీరు కోల్పోయారు
ఇట్లు
అరుంధతీ రాయ్.