సీనియర్ నటుడు.. యాక్షన్ హీరోగా సుపరిచితులు.. వయసుకు తగ్గట్లుగా తన పాత్రల్ని మార్చుకుంటూ దూసుకెళుతున్న సీనియర్ నటుల్లో అర్జున్ ఒకరు.
ఆయన తన కుమార్తెను హీరోయిన్ గా పెట్టుకొని ఒక మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో హీరోగా యువనటుడు విశ్వక్ సేన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ మేకింగ్ కు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు వస్తున్న వేళ.. అనూహ్యంగా ఆ వార్తలు నిజమేనంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలనానికి తెర తీశారు అర్జున్.
సాధారణంగా అర్జున్ లాంటి సీనియర్ నటులు.. ఏదైనా ఇష్యూ వస్తే తెర వెనుకనే లెక్కలు తేల్చుకుంటారే తప్పించి మీడియా ముందుకు వచ్చి.. ప్రెస్ మీట్ పెట్టి మరీ విషయాల్ని అధికారికంగా తెలియజేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు.
అందుకు భిన్నంగా అర్జున్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టటమే కాదు.. కాస్తంత గట్టిగానే మాట్లాడటంతో పాటు.. విశ్వక్ సేన్ తీరుపైన ఆయన ఘాటు విమర్శలు చేశారు.
తనలా మరో నిర్మాతకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు కంప్లైంట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో.. అందునా కాస్త పేరున్న నటీనటులతో సినిమా చేసే ప్రముఖుడు ఎవరు ఇటీవల కాలంలో ఇలా చేసింది లేదు. ఈ ఇష్యూలో అర్జున్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
మరి.. అర్జున్ ప్రెస్ మీట్ నేపథ్యంలో విశ్వక్ సేన్ రియాక్షన్ ఏమిటి? ఆయన కూడా మీడియా ముందుకు రానున్నారా? లేదంటే మాటలతో కాకుండా చేతలతో తాను చేయాలనుకున్న పనిని పూర్తి చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఇష్యూ మీద విశ్వక్ సేన్ నేరుగా రియాక్టు కాకుండా.. తన సిబ్బంది ద్వారా మీడియాకు లీకులు ఇస్తున్నట్లుగా చెప్పాలి.
అర్జున్ ఆరోపించినట్లుగా సినిమా నిర్మాణంలో తాను అధికంగా జోక్యం చేసుకున్నానన్న ఆరోపణలో కాసింత నిజం ఉందని.. ముఖ్యంగా పాటలు.. మ్యూజిక్.. సంభాషణలు విషయంలో కొన్ని సూచనలు చేశారని.. ఆసక్తికరంగా అనిపించిన చిన్న మార్పులకు కూడా అర్జున్ నో చెప్పటంతో ఇద్దరి మధ్య గ్యాప్ రావటానికి కారణమంటున్నారు.
విశ్వక్ సేన్ సూచనల్ని పరిగణలోకి తీసుకోకపోవటమే కాదు.. తాను చెప్పినట్లు మాత్రమే నడుచుకోవాలని తేల్చి చెప్పటం ఇష్యూ మరో లెవల్ కు వెళ్లేలా చేసినట్లు చెబుతున్నారు.
తనకు నచ్చని పని ఎంత పెద్దదైనా సరే చేసేందుకు విశ్వక్ ఇష్టపడరని.. అందుకోసం నష్టపోవటానికి సైతం సిద్ధపడతారని.. అర్జున్ సినిమా విషయంలోనూ అదే జరిగినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఇలాంటి వివాదాలు విశ్వక్ కెరీర్ పై ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నా.. తాను తప్పు చేయలేదని.. తనకేమీ కాదన్న ధీమాతో విశ్వక్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. తన మీద వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ.. సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్.. అగ్రిమెంట్ పత్రాల్ని నిర్మాతల మండలికి పంపినట్లుగా చెబుతున్నారు.
మరి.. ఈ పంచాయితీ ఎక్కడి వరకు వెళుతుంది? ఎలా క్లోజ్ అవుతుందన్నది తేలాల్సి ఉంది.