యంగ్ హీరో విశ్వక్సేన్, హీరో అర్జున్ కు మధ్య వివాదం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తన కూతురును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు స్వయంగా నిర్మిస్తూ ఆ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నారు అర్జున్. అయితే, కొంత షూటింగ్ జరుపుకున్న తర్వాత విశ్వక్ తో అర్జున్, చిత్ర యూనిట్ కు విభేదాలు రావడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో, విశ్వక్ తీరుపై పలువురు టాలీవుడ్ పెద్దలు కూడా పెదవి విరిచారు.
దీంతో, తాను మరో హీరోతో ఆ సినిమాను మళ్లీ మొదలుబెడతానని అర్జున్ ప్రకటించారు. తన కూతురి తెలుగు తెరంగేట్ర సినిమా కావడంతో అర్జున్ దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఆ సినిమాను పట్టాలెక్కింకేందుకు అర్జున్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తో అర్జున్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్ వస్తోంది.
ఆ కథకు శర్వానంద్ కరెక్టుగా సూట్ అవుతాడని అర్జున్ అనుకుంటున్నారట. అందుకే, ఆలస్యం చేయకుండా శర్వాను లైన్ లో పెట్టేందుకు అర్జున్ గట్టిగా ట్రై చేస్తున్నారట. శర్వానంద్ వ్యవహార శైలి కూల్ గా ఉంటుందని, సౌమ్యుడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే, శర్వా అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ కూడా ఫిక్స్ అయ్యారట. ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ కొట్టిన శర్వా…అర్జున్ సినిమాకు ఓకే చెబుతాడా లేదా అన్నది తేలాల్సి ఉంది.