ఆయన పూజారి. నిత్యం.. సంధ్యావందనం.. జపం, తపం, హోమం, పూజలతో సాత్వికాలంకారంలో ఉండే పంతులుగారు. సమాజానికి హితోపదేశాలు చేస్తూ.. భక్తులను సన్మార్గంలో నడిపించే స్థానంలో ఉన్నారు. కానీ, బుద్ధి వక్రించింది. పూజకు వచ్చిన మహిళను ప్రేమించాడు. ఆమెతో కాలం గడిపాడు. తర్వాత ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో వక్రమార్గం పట్టి.. ఏకంగా హత్యకు బరితెగించాడు. ఈ క్రమంలో అతను ఏకంగా ఇంటర్నెట్లో వెతికి మరీ… హత్య చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. పూలు, పళ్లు, తులసి మాలలు మాత్రమే ఎరిగిన చేతులకు ప్రాణాలు తీయడం నేర్పించాడు. చివరకు నమ్మి వచ్చిన ప్రేమికురాలిని కర్కశంగా చంపేశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
ఎవరు? ఎక్కడ?
హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో సాయికృష్ణ పూజారిగా పనిచేస్తున్నారు. ఓ ఫైన్ డే అప్సర అనే మహిళ ఆలయానికి వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలోనే సాయికృష్ణ దర్శనం కూడా అయింది. అంతే.. తర్వాత అనూహ్యంగా ఇద్దరి మధ్యా వాట్సాప్ చాటింగులు.. జరిగాయి. తర్వాత ఇది ప్రేమాయణానికి దారి తీసింది. క్రమంగా అది వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ గత నవంబరులో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది.
ఈ క్రమంలోనే అప్సర తనను పెళ్లి చేసుకోమని సాయికృష్ణపై ఒత్తిడి పెంచింది. అంతేకాదు, తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించింది. దీంతో రగిలిపోయిన సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలనుకోవాలని ప్లాన్ చేశాడు. హత్యకు వారం రోజుల ముందు ‘మనిషిని చంపడం ఎలా?’ అనే విషయంపై సాయికృష్ణ ఇంటర్నెట్లో శోధించాడు. హత్య చేయడంపై అధ్యయనం పూర్తి చేశాడు.
పక్కా ప్లాన్‌తో..
గతంలో తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు కోరడంతో.. అదే విషయాన్ని చెప్పి.. ఆమెను రమ్మని కబురు పెట్టాడు. జూన్ 3వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించిన సాయికృష్ణ.. ఆమెను కారులో ఎక్కించుకొని రాత్రి 8.15 గంటలకు సరూర్‌నగర్ నుంచి బయల్దేరాడు. రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్ చేరుకున్నారు. అయితే, మార్గమధ్యంలో టికెట్ బుక్ చేయలేదని బాంబు పేల్చాడు.
అయితే.. ఎలాంటి అనుమానం రాకుండా.. అక్కడి నుంచి గోశాలకి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరూ సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమెను స్థానిక డ్రైనేజీలో పడేసి చేతులు దులుపుకొన్నాడు. ఈ కేసును విచారించి పోలీసులు..రిమాండ్ రిపోర్టును రెడీ చేశారు. ఈ విషయం తెలిసిన వారు.. ఈ పూజారి మామూలోడు కాదు! అని కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
https://twitter.com/ActualIndia/status/1667581283319558145