జంగారెడ్డి గూడెం కల్తీ సారా మృతుల వ్యవహారంలోకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో దొరికే మద్యం శాంపిల్స్ ను చెన్నైలోని ఎస్ జీఎస్ ల్యాబ్ కు పంపి పరీక్షలు జరిపించిన రఘురామ…అందులో విష పదార్ధాలున్నట్లు తేలిందని ప్రధాని మోడీకి లేఖ రాశారు. జాతీయ స్థాయిలో తమ గుట్టు రట్టయిందని మదనపడుతున్న వైసీీపీ నేతలు….రఘురామపై క్రిమినల్ కేసు పెడతామని, పవురు నష్టం దావా వేస్తామని బెదిరించారు.
ఎస్జీఎస్ ల్యాబ్‌కు రఘురామ పంపించిన శాంపిల్స్ ఏపీ నుంచి సేకరించినవే అని చెప్పడానికి ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖాధికారి రజత్ భార్గవ అన్నారు. బీఎస్ ఐ నిబంధనల ప్రకారం పరీక్షలు చేయలేదని అన్నారు. ఆ మద్యం హానికరమని ఎస్జీఎస్ చెప్పలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో నాటు సారా, కల్తీ మద్యం బ్రాండ్ల వ్యవహారం ఏపీ అసెంబ్లీలో మొదలై తాజాగా పార్లమెంటుకు చేరింది.
తాజాగా ఈ వ్యవహారంపై లోక్ సభలో వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చర్చ జరిపారు. ఏపీలో మద్యం నాణ్యతపై ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని అలా లేఖ రాసినందుకు తనపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని రఘురామ సభలో ఆరోపించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతోనే తాను ప్రధాని మోడీకి లేఖ రాశానని అన్నారు. అందుకే, తనపై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావా అంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు.
మద్యం నాణ్యతపై పరీక్షలు చేయించడం, ఆ పరీక్షల నివేవదికను ప్రధానికి తెలియజేయడం తప్పా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో రఘురామ ప్రసంగానికి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అడ్డుపడి…గందరగోళం చేశారు. రఘురామకు వ్యతిరేకంగా మార్గాని భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆ తరహా వ్యాఖ్యలు చేసిన సభ్యులను సభ నుంచి బయటకు పంపాలని రఘురామ కోరారు. ఈ క్రమంలోనే భరత్ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ప్యానెల్ స్పీకర్ రమాదేవి ఆదేశించారు.