తెలుగువారందరికీ ఉగాది పండుగ ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర లేదు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాదిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే అమెరికాలోని టెక్సాస్ లో ఉగాదినాడు తెలుగు భాషకు అరుదైన గౌరవం దక్కింది. శుభకృత్ నామ సంవత్సరంతో నూతన ఏడాదిలోకి ప్రవేశించిన తెలుగువారందరికీ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఉగాది పచ్చడి తిన్నంత కమ్మటి కబురందించారు.
శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” గ్రెగ్ అబ్బాట్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధికార ప్రతిని ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు గవర్నర్ అబ్బాట్ అందజేశారు. టెక్సాస్‌లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాలు, వారి సంస్కృతి సంప్రదాయాలతో మమేకమవుతూ విద్య, వైద్యం, వాణిజ్యం, ప్రభుత్వ, కళా రంగాలలో వారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని అబ్బాట్ అన్నారు.
తెలుగు వారి క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల వారికుండే గౌరవం, నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమన్నారు. టెక్సాస్‌లో తెలుగువారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు కృషి చేయాలని అబ్బాట్ పిలుపునిచ్చారు. టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలంగా నివసిస్తున్న తెలుగువారి పట్ల ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్న గవర్నర్ అబ్బాట్‌కు ప్రసాద్ తోటకూర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ గ్రెగ్ అబాట్, ఆయన భార్య సిసీలియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.