భారత దేశ అపర కుబేరుడు.. ఆ మాటకు వస్తే ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ తో పోటీ పడే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. తరచూ పెరిగిన సంపదతో ఆయన ఎంత సంపన్నుడన్న విషయాన్ని చెప్పే వార్తలు.. లేదంటే.. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకూ విస్తరించే విషయాలకు సంబంధించిన వార్తలే వస్తుంటాయి. ఆయన తన గురించి కానీ తన ఆశలు.. ఆకాంక్షల గురించి కానీ చెప్పటం లాంటివి పెద్దగా రావు. ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి.మరి.. ముకేశ్ అంబానీ ముందున్నలక్ష్యాలు ఏమిటి? అన్న ప్రశ్న వినేందుకే ఆసక్తికరంగా ఉంది కదూ?
మరి.. ఇలాంటి ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానం ఏమై ఉంటుందన్న విషయంలోకి వెళితే..తాజాగా ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన్ను.. ఏ విషయంలో మీరు గుర్తుండిపోవాలని భావిస్తున్నారు? అని ప్రశ్నించారు. తనకు ఎదురైన ప్రశ్నకు సూటిగా.. స్పష్టంగా తన మనసులోని మాటను చెప్పేశారు అంబానీ.
తనకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు లక్ష్యాలు ఉన్నట్లుగా వెల్లడించారు ముకేశ్ అంబానీ.
అందులో మొదటి టార్గెట్.. భారత్ ను ఒక డిజిటల్ వ్యవస్థగా మార్పు చేయటమని..
రెండో లక్ష్యం అత్యున్నత నైపుణ్యాల్ని కనబరిచే దిశగా దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దటంగా చెప్పారు.
ఇక.. మూడో లక్ష్యం.. సంప్రదాయ ఇంధన వనరుల వాడకంతోఉండే దేశాన్ని రెన్యువబుల్ ఎనర్జీ వినియోగించే దిశగా మళ్లించటమని చెప్పారు. అంబానీ ఆశల్ని.. ఆయన లక్ష్యాన్ని చూసినప్పుడు.. సరికొత్త భారత్ ను చూడాలన్న ఆకాంక్ష వ్యక్తం కావటం కనిపిస్తుంది. మరి.. ఆయన తన లక్ష్య సాధనను ఎంతమేర సాధిస్తారో చూడాలి.