మెగా డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను ఏపీ సర్కార్ మభ్యపెడుతోందని కాంగ్రెస్ నేతలు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల , పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు చలో సెక్రటేరియట్ కార్యక్రామానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉండవల్లి దగ్గర షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
తీవ్ర వాగ్వాదాల మధ్య షర్మిలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను బలవంతంగా ఎత్తుకొని పోలీసులు తమ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సమయంలో షర్మిల అదుపుతప్పి వాహనం ఫుటం బోర్డ్ పై పడిపోయారు. అయినా సరే, వెనక్కి తగ్గని పోలీసులు ఆమెను వాహనంలోకి ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో పాటుగా షర్మిలను కూడా సాధారణ వాహనంలోనే పోలీసులు స్టేషన్ కు తరలించారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన షర్మిల…ఉద్యోగాల విషయంలో జగనన్న కంటే చంద్రబాబు నయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో చంద్రబాబును విమర్శించిన జగనన్నకు ఆ మాటలు వర్తించవా అని ప్రశ్నించారు. ఇక గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వైసిపి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు.