తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. తానేమీ వైసీపీ నేతల్లాగా ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టెప్నీలతో తిరగడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, తాను భరణం ఇచ్చి, విడాకులు తీసుకున్న తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని, అలా చేసుకోవడంలో తప్పేంటని పవన్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. చేతనైతే మీరు కూడా భరణమిచ్చి మరో పెళ్లి చేసుకోండంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ షాకిచ్చింది. 3 పెళ్లిళ్లకు సంబంధించి పవన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం నోటీసులు జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వాటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని నోటీసులలో పేర్కొంది. ఈ క్రమంలోనే పవన్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తక్షణమే మహిళలకు పవన్ క్షమాపణలు చెప్పాలని, భార్యకు విడాకులు, భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చని పవన్ వ్యాఖ్యానించడం తనను బాధించిందని పద్మ చెప్పారు. భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఏముంటుందని ఆమె ప్రశ్నించారు. స్టెప్నీ అంటూ మహిళలను పవన్ సంబోధించడంపై కూడా పద్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కామెంట్లను తప్పుబట్టిన పద్మ…గతంలో వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని వంటి వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక, పవన్ కామెంట్లు చేసిన నాలుగు రోజుల తర్వాత ఏపీ మహిళా కమిషన్ స్పందించడం ఏమిటని కామెంట్లు వస్తున్నాయి.