ఏపీ సీఎం జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని విపక్షాలే కాదు…కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చాలాసార్లు చెప్పింది జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని గతంలోనే ఎన్నోసార్లు తేల్చి చెప్పింది.
అయినప్పటికీ, ఏనుగు మీద నీళ్లు పడ్డట్టున్న జగన్ సర్కార్…తమ అప్పుల తప్పులను సమర్థించుకుంటూ….అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. సరే అప్పులు చేస్తే చేశారు…కనీసం ఆ లెక్క చెప్పండి అని ఏపీ సర్కార్ ను కాగ్ అడుగుతున్నా స్పందన లేదని, ఏపీ ఖజానా జమా ఖర్చులు తేల్చడానికి తమకు అవసరమైన సమాచారాన్ని జగన్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదని కాగ్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగ్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే జగన్ హయాంలో నడుస్తున్న ఏపీ ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదు.
ఈ నేపథ్యంలోనే కాగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అప్పులు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని తాజాగా విడుదలైన కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని యనమల అన్నారు. ప్రజలపై నానాటికీ అప్పులు, పన్నుల భారాలు పెరిగిపోతున్నాయని, అభివృద్ధి అడుగంటిపోయిందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే పరిస్థితి కొనసాగితే నైజీరియా, జింబాబ్వేల కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందని యనమల హెచ్చరించారు. మరి కొన్నాళ్లపాటు జగనే సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియా కావడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను బడ్జెట్లో చూపించకుండా జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని యనమల ఆరోపించారు. మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, కానీ ప్రజల ఆదాయం పెరిగి అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని యనమల అన్నారు.
ఏపీ చేసిన అప్పులకు ప్రతి సంవత్సరం దాదాపు 50 వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాలని, భవిష్యత్తులో ఇది లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. 2021 మార్చినాటికి చేసిన అప్పులు జిఎస్ డిపిలో 44 శాతానికి చేరాయని, అప్పులు తీర్చడానికి మరోసారి అప్పు చేయడం దారుణమని అన్నారు. ఆదాయం పెంచడంపై దృష్టి సారించని జగన్ అప్పులు చేయడంపై మాత్రం ఫోకస్ పెట్టారని ఎద్దేవా చేశారు.