ఏపీలో పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వలంటీర్లు షాకిచ్చారు. జీతాల పెంపు కోరుతూ వలంటీర్లు ఆందోళన చేపట్టారు. తమకు తక్కువ జీతాలిచ్చి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారంటూ రోడ్డెక్కారు. సీఎం జగన్ తక్షణమే తమ జీతాలను రూ.8 వేల నుంచి రూ.12వేలకు పెంచి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో, విశాఖ గాజువాకలో, విజయవాడలో వలంటీర్లు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వలంటీర్ల పని ఏమిటి, ఎన్ని గంటలు చేయాలన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, కానీ, ఇపుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు.
రేషన్ డోర్ డెలివరీ ట్రక్ డ్రైవర్లకు ఇచ్చినంత జీతం కూడా తమకు ఇవ్వడంలేది ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లుగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా తాము పనిచేస్తున్నప్పటికీ తమకు కనీస గౌరవం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని, అయినా సర్కార్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విజయవాడలో ఆందోళనకు దిగిన వలంటీర్లలలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళనల నేపథ్యంలో వలంటీర్ల డిమాండ్లను జగన్ సర్కార్ పరిష్కరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.