జూన్ 4. ఎన్నికల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ లో సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు అందరి చర్చా కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఏది ? అన్న దాని మీదనే జరుగుతుంది. జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు అప్పుడే ముహూర్తం కూడా నిర్ణయించారు. విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయం పనులు జోరుగా జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు ఖాయం అని చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. 2014లో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు అమరావతి సమీపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల వాదనను తెరమీదకు తెచ్చారు.
ఈ సారి అధికారంలోకి వస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వస్తే మూడు రాజధానుల ప్రకటనకు అనుగుణంగా చర్యలు ఉంటాయి. విశాఖను పాలనా రాజధానిగా నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అమరావతి ఏకైక రాజధానిగా అధివృద్ది చెందనున్నది.
రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా 81.86 శాతం పోలింగ్ నమోదయింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే తామే గెలుస్తాం, అదికారంలోకి వస్తాం అని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైతే రాజధాని ఏదన్న విషయం ఖాయం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.