జగన్ పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ కాస్తా…గంజాయాంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో యువత విచ్చలవిడిగా గంజాయి వాడుతున్నారని…పల్లెలకు కూడా గంజాయి పాకిందని వారు మండిపడుతున్నారు. కొందరు వైసీపీ నేతలు కూడా గంజాయి సాగు, రవాణాకు సహకరిస్తున్నారని, గంజాయి మాఫియాకు వారు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే భారత దేశంలో గంజాయి సరఫరా చేసే రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక ద్వారా వెల్లడైంది. 2021లో పట్టుబడ్డ గంజాయి, హెరాయిన్ నిల్వలల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు అవమానకరరీతిలో అగ్రతాంబూలం దక్కింది. ఆ అవమానం మరువక ముందే తాజాగా స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కూడా దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల్లో ఏపీ నంబర్ వన్ గా నిలవడం షాకింగ్ గా మారింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ తాజా నివేదిక ప్రకారం ఏపీలో 18వేల కిలోల డ్రగ్స్ ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయిని వెల్లడైంది. 1012 కిలోల గంజాయి, 97 కోట్ల రూపాయల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నివేదికపై సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ నేత బొండా ఉమ డిమాండ్ చేశారు. ఈ నివేదికపై జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారని ఉమ ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై జగన్ స్వయంగా స్పందించాలని… సజ్జలో, బిజ్జలో చెబుతామంటే ఊరుకునేది లేదని ఉమ హెచ్చరించారు. రాష్ట్రం నుంచి దేశ నలుమూలలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీని గంజాయి సాగుకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఆ ఘనత విజయసాయిరెడ్డిదేనని,జగన్ రెడ్డేమో కలెక్షన్లలో మునిగి తేలుతున్నారని విమర్శించారు.
సంకల్పసిద్ధి సంస్థ ద్వారా అమాయక ప్రజలను మోసగించి, కోట్లు కొల్లగొట్టారని, రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్ల దందాతో ఏపీలో వైసీపీ నేతలు పోగేసిన సొమ్మంతా ఇతర రాష్ట్రాలకు చేరిందని ఆరోపించారు. వందలు, లక్షల కోట్లు సంపాదించడానికి వైసీపీ నేతల తాతలు, తండ్రులు ఏమైనా పుట్టుకతో జమీందారులా? ఏం వ్యాపారాలు చేసి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారో చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీ…ఇలా పెద్ద బ్యాచ్ ఉందని… అలీబాబా దొంగల ముఠాలోని వారు దొరికితే వెనకున్న పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్పారు.