ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలాసలో భూ ఆక్రమణల తొలగింపు గౌతు లచ్చన్న విగ్రహం తొలగింపుతోనే ప్రారంభిస్తామని అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత గౌతు శిరీష మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలకు అప్పలరాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నేడు పలాసలో లచ్చన్న విగ్రహం దగ్గర వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పలరాజుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. లచ్చన్న వంటి వారి కృషి ఫలితంగానే అప్పలరాజు వంటి వాళ్ళు మంత్రులయ్యారని అచ్చెన్నాయుడు అన్నారు. లచ్చన్నపై చేసిన వ్యాఖ్యలకు అప్పలరాజు క్షమాపణ చెబితే మంత్రికి గౌరవం పెరిగేదని అన్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్ విగ్రహాలు వీధికొకటి పెట్టారని, టీడీపీ హయాంలో వాటిని తొలగించే ప్రయత్నం చేశామా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 19 మాసాల్లో అప్పలరాజు పలాసకు చేసిందేమీ లేదని, బెదిరింపులకు, అవినీతికి మంత్రి పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో తాము కక్షపూరితంగా వ్యవహరిస్తే అప్పలరాజు ఉండేవాడా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులు జాతకాలన్నీ భద్రంగా ఉన్నాయని అన్నారు. మరోవైపు, అప్పలరాజు చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పలరాజుకు సంస్కారం లేదని, తన వ్యాఖ్యలకుగాను తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కనుసన్నల్లో పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని విమర్శించారు. లచ్చన్న చరిత్రను మంత్రి అప్పలరాజు తెలుసుకోవాలని, ఈ ప్రాంతానికి ఆయన చెడ్డ పేరు తెస్తున్నారని దుయ్యబట్టారు.