తమది దళితుల పక్షపాత ప్రభుత్వమని, దళితులకు తమ పాలనలో పెద్దపీట వేశామని ఏపీ సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. దళితులకు మంత్రిపదవులిచ్చామని, వారి సంక్షేమానికి కంకణం కట్టుకున్నామని జగన్ సర్కార్ చెబుతోంది. అయితే, జగన్ మాటలు కోటలు దాటుతున్నా… చేతలు మాత్రం గడప దాటడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, దివంగత వైసీపీ నేత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించలేని ముఖ్యమంత్రిపై దళితులంతా ఒక్కటై తిరగబడాలని, జగన్ను దళితులు రాష్ట్రం నుంచి వెలివేయాలని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించేవారని దుయ్యబట్టారు. జగన్ కు దళితులపై ప్రేమ లేదనేందుకు ఎన్నో ఘటనలున్నాయని అచ్చెన్నాయుడన్నారు. ఓ మంత్రి తల్లి చనిపోతే సీఎం హెలికాఫ్టర్లో వెళ్లి పరామర్శించారని, కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్సీ చనిపోతే హెలీకాఫ్టర్లో వెళ్లి పరామర్శించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కానీ, దళిత ఎంపీ దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ కు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. దళితులంటే జగన్ కు అంత చులకనభావం ఎందుకని అచ్చెన్నాయుడు నిలదీశారు.
ఏపీ రాజధాని అమరావతిని మార్చి ముక్కలు చేయాలని జగన్ ముందుకు వెళుతున్నారని, అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అని అచ్చెన్నాయుడు అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం చట్టంలో లేదని తాము గతంలోనే చెప్పామని, ఆ పదం కోర్టులో నిలబడదని కూడా చెప్పామని గుర్తు చేశారు. టీడీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అసెంబ్లీలో సినిమా చూపించారని, ఇప్పుడు వైసీపీ నేతలంతా ఎందుకు నోరు తెరవడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా జగన్ తీరు మారడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తీరు మార్చుకుని, రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై నమోదైన సీఐడీ కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.