ఏపీ సీఎం జగన్‌కు.. ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చాలా తేడా ఉందని తరచుగా రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు చెప్పే మాట. ఇదే విషయాన్ని అప్పుడప్పుడు.. టీడీపీ అదినేత చంద్రబాబు కూడా అనేవారు. ఇటీవల కాలంలో ఆయన అసెంబ్లీలోనూ వైఎస్ గురించి పేర్కొ న్నారు. అయితే.. చంద్రబాబు చెప్పినా.. మరెవరో చెప్పినా.. రాజకీయ కోణంలోనే చూడడం అలవాటైన వారికి నిజమేనా? అనే సందేహాలు ఉండేవి. ముఖ్యంగా కక్షపూరిత రాజకీయాలు వైఎస్ చేసేవారు కారని.. ప్రతిపక్ష నేతకు విలువ ఇచ్చేవారని.. తృణీకరించి మాట్లాడేవారు కారని.. హుందాగా వ్యవహరించేవారని పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు.
ఇక, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పలు సందర్భాల్లో వైఎస్‌కు, జగన్‌కు నక్కకు నాగలోకాని కి ఉన్నంత తేడా ఉందని అనేవారు. ఈ సందర్భంగా పలు విషయాలను కూడా పోల్చి చెప్పేవారు. ఇక, ఇప్పుడు అనూహ్యంగా ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం సంచలనంగా మారింది. వాస్తవానికి అటు జగన్ సర్కారుకు, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మధ్య ఉప్పు-నిప్పు మాదిరిగా పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పరోక్షంగా రమేష్ కుమార్.. సీఎం జగన్‌కు.. ఆయన తండ్రికి వైఎస్ రాజశేఖరరెడ్డికి మధ్య తేడాను చెప్పకనే చెప్పేశారు. అదేంటో చూద్దాం..
+ నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారు.
అంటే.. జగన్ నిజాలను చెప్పేవారిని అణిచివేస్తున్నారనే కదా!
+ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే నా జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది.
దీనిని బట్టి.. జగన్ దగ్గర పనిచేసేవారు.. కేసులు ఎదుర్కొంటున్నారనే కదా
+ వైఎస్ఆర్ ఆశీస్సులు నాకు బలంగా ఉన్నాయి.
అంటే.. జగన్ ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో తెలియవు కానీ.. ఆయన అందరినీ వాడుకుంటున్నారుఅనే!
+ వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉంది
దీనిని బట్టి.. సీఎం జగన్ కు రాజ్యాంగం అంటే ఏమాత్రం విలువ లేదని అర్థం అవుతోంది.
+ వైఎస్…పలు కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారు.
అంటే.. జగన్ కీలక అంశాల్లో ఎవరికీ స్వేచ్ఛ ఇవ్వకుండా నియంతృత్వ ధోరణిలో ఉన్నారనే కదా!
+ వైఎస్ ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదు.
దీనర్థం.. జగన్ రాజ్యాంగ వ్యవస్థలైన కోర్టులను, ఎస్ ఈసీలను కూడా బురదలోకి దింపేస్తున్నారనే
+ వైఎస్ దగ్గర పని చేసినప్పుడు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు
అంటే.. ఇప్పుడు జగన్ దగ్గర పనిచేస్తున్నవారు.. అనేక ఇబ్బందులు పడుతున్నారనే కదా!
+ వైఎస్‌లో లౌకిక దృక్పథం ఉండేది
దీనర్థం.. జగన్ ఓ మతానికి కొమ్ముకాస్తున్నారు. ఇతర మతాలను ద్వేషిస్తున్నారనేగా!
కొసమెరుపు: ఇప్పటి వరకు జగన్‌కు-నిమ్మగడ్డకు మధ్య జరిగిన ఆరోపణలు.. వివాదంలో ఇది నూతన అధ్యాయం. వైఎస్ పాలనను అందిస్తానని చెప్పిన జగన్‌కు వైఎస్‌కు ఎక్కడా పొంతనలేదనే విషయాన్ని అటు నేతలు.. ఇటు అధికారులు కూడా స్ఫస్టం చేస్తుండడం గమనార్హం. మరి ఈ పరిణామం ఎటు దారితీస్తుందోచూడాలి.