ఏపీలో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ నేతుల అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ సమయంలో అధికార పార్టీ నేతలు కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో గోల్ మాల్ చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు కోరితే రికార్డు చేయాల్సిందేనని సూచించింది.
అయితే, ఈ వీడియో రికార్డు ప్రక్రియ అమలు కాకపోవడంతో ఎస్ఈసీపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పంచాయితీ ఎన్నికల కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలలో కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాలంటూ జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వెబ్ కాస్టింగ్ లేదా సీసీ కెమెరాలు లేదా వీడియోగ్రఫీ తప్పనిసరి అని పేర్కొంది.
రికార్డ్ చేసిన వీడియో దృశ్యాలను భద్రపరచాలని స్పష్టం చేసింది. నిష్పక్షపాతం, పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు ఈ ఏర్పాట్లని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్ఈసీ స్పష్టం చేసింది. కౌంటింగ్ ప్రక్రియ రికార్డు చేయడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతకుముందు, కుప్పంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, వాటి గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను ఎందుకు రికార్డు చేయలేదని ఎస్ఈసీని నిలదీశారు. కుప్పంలో టీడీపీ కాదు ప్రజాస్వామ్యమే ఓడిందని అన్నారు. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యల అనంతరం వీడియో రికార్డింగ్ పై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.