జగన్ పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ కాస్తా…గంజాయాంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో యువత విచ్చలవిడిగా గంజాయి వాడుతున్నారని…పల్లెలకు కూడా గంజాయి పాకిందని వారు మండిపడుతున్నారు. కొందరు వైసీపీ నేతలు కూడా గంజాయి సాగు, రవాణాకు సహకరిస్తున్నారని, గంజాయి మాఫియాకు వారు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేతల పోరాటంతో గత ఏడాది కొన్ని చోట్ల తనిఖీలు చేపట్టిన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయిన సరే రాష్ట్రంలో గంజయి రవాణా మాత్రం ఇబ్బడిముబ్బడిగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భారత దేశంలో గంజాయి సరఫరా చేసే రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం సిగ్గుచేటు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021లో పట్టుబడ్డ గంజాయి, హెరాయిన్ నిల్వల నివేదికను తాజాగా విడుదల చేయగా..అందులో ఆంధ్రప్రదేశ్ కు అవమానకరరీతిలో అగ్రతాంబూలం దక్కింది.
గత ఏడాది దేశంల మొత్తం మీద 7 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 26 శాతం ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కిలోల గంజాయి పట్టుబడింది. ఏపీ తర్వాత ఒడిస్సా రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. హెరాయిన్ రవాణాలో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా..యూపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 35,270 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది.
భారత్ లో రవాణా అవుతోన్న గంజాయిలో 50 శాతానికిపైగా ఆంధ్రా, ఒడిస్సాల నుంచే సాగవడం సంచలనం రేపుతోంది. ఏపీలో గంజాయి రవాణా చేస్తున్న 4202 మందిని అరెస్ట్ చేయగా,1775 కేసులు నమోదు చేశారు. అయితే, ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా గంజాయి తోటలు వందల ఎకరాల్లో ఉన్నాయని, వాటిని ధ్వంసం చేసే దిశగా పోలీసులు, ఎస్ఈబీ అధికారులు చర్యలు తీసుకోకుంటే…ఏపీ మరో ఉడ్తా పంజాబ్ అవుతుందని అంటున్నారు.