ఏపీ పాలిటిక్స్ ఢిల్లీ సెంట్రిక్ గా రోజుకో రూపు సంతరించుకుంటున్నాయి. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢీల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షాతో భేటీ కాగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేతల హస్తీనా బాట పట్టగా ఇంతలో సీఎం జగన్ సైతం ఢీల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. ఓ వైపు ప్రతిపక్ష నేతలు మరోవైపు సీఎం జగన్ ఇలా వరుసగా ఒక్కరి తర్వాత మరొకరు హస్తినా బాట పడుతుండటంతో రాష్ట్ర రాజకీయం అంతా ఢిల్లీ చుట్టే తిరుగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ నేత కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇదివరకే టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకొని సీట్ల సర్ధుబాటులో ఉన్నాయి.
వీటితో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్దంగా ఉందని, పార్టీలతో చర్చలు ముగిశాక పొత్తుల అంశంపై ప్రకటన విడుదల చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశంలో పొత్తుల అంశం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తొంది. పొత్తు దాదాపు ఖరారు అయ్యిందని, సీట్ల పంపకాల విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పొత్తుల అంశం పై వచ్చిన వార్తల నేపథ్యంలో హుటాహుటిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించడానికే మోదీతో సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నా.. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీలో సిట్టింగ్ లు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వారంతా జగన్ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరితే తమకు ముప్పు తప్పదని భావించిన జగన్ అప్రమత్తం అయ్యారని ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో తన వైఖరిని జగన్ నేరుగా ప్రధాని మోడీకే వివరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ విషయంలో వైసీపీ పూర్తిగా సరెండర్ అయిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, అమిత్ షా భేటీతో తమకు ముప్పు తప్పదని గ్రహించడంతోనే వైసీపీ ఆందోళన చెందుతోందనే టాక్ రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది.
మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఏపీ పాలిటిక్స్ లో ప్రజలు ఎటువైపు నిలుస్తారు అనేది త్వరలోనే తేలనున్నది.