గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా చేరుకొని.. ఎయిర్ పోర్టు బయటకు వస్తున్న వేళలో.. భారీగా చేరుకున్న కార్యకర్తలు, అభిమానులతో సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కొందరు కార్యకర్తల కారణంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పోలీసుల పట్ల దురుసుతనంతో వ్యవహరించటం.. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఫెయిల్ కావటం గమనార్హం.
మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వేళలో బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు జగన్ దంపతులు. వారికి స్వాగతం పలికేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి.. మొండితోక అరుణ్ కుమార్.. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి.. మాజీ ఎమ్మెలయే అనిల్ కుమార్.. కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషులతో పాటు పలువురు కిందిస్థాయి నాయకులు.. కార్యకర్తలు.. అభిమానులు భారీగా చేరుకున్నారు.
విమానాశ్రయం నుంచి జగన్ బయటకు వచ్చిన సందర్భంలో ఆయన వద్దకు వెళ్లేందుకు ఒక్కసారిగా కార్యకర్తులు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే డ్యూటీ చేస్తున్న ఎస్ఐ.. కానిస్టేబుళ్లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
వారిని బలవంతంగా వెనక్కి లాగేస్తూ.. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారు. జగన్ కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా వారు కారు ఆపకుండా ఎస్కేప్ అయ్యారు. వారెవరు? వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ విషయం ఏమంటే.. పోలీసులపై దురుసుతనంతో వ్యవహరించారు సరే.. వారిని కనీసం పట్టుకోలేని పరిస్థితేంటి?
ఒకవేళ.. ఏదైనా అనుకోనిది జరిగితే చెడ్డపేరు ఎవరికి? ప్రభుత్వానికే కదా? గన్నవరం ఎయిర్ పోర్టుకు జగన్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున నేతలు.. కార్యకర్తలు వస్తున్నారు. ఇలాంటి వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల తీరుపై కథలు కథలుగా మీడియాలో వచ్చేవి. అలాంటి పోలీసింగ్ కు భిన్నంగా.. ఇప్పుడు వారిపైనే దురుసుగా వ్యవహరించే వరకు విషయాలు వెళ్లటం దేనికి నిదర్శనం? ఇదంతా చూస్తే.. ఏపీ పోలీసులకు ఏమైంది అన్న సందేహం రాక మానదు. ఏమైనా.. ఇలాంటి ఘటనల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.