ఏపీ సీఎం జగన్ ఎక్కడికైనా బయటకు వస్తున్నారంటే.. చాలా తీవ్రమైన అలజడి రేగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. చెట్లు కొట్టేయడం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం.. సభల్లో ప్రజలను బలవంతంగా కూర్చోబెట్టడం.. వంటివి తరచుగా కనిపిస్తున్నాయని.. ప్రజల ఆవేదన కూడా వినిపిస్తోందని విపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా సీఎం జగన్ పర్యటనలో పోలీసులు టిఫిన్ కోసం కుమ్ములాడుకోవడం.. అందరినీ విస్మ యానికి గురి చేసింది. సహజంగా సీఎం పర్యటన అంటే.. పోలీసులపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటోంది. తెల్లవారుజామునే వారిని ఫీల్డ్‌కు పంపిస్తున్నారు. బందోస్తు నుంచి ఏర్పాట్లలో లోపాల వరకు వారినే బాధ్యులను చేస్తున్నారు. దీంతో వారు టిఫిన్ చేసేందుకు కూడా సమయం ఉండడం లేదని వాపోతున్నారు.
శనివారం సీఎం జగన్.. అనంతపురం జిల్లా కల్యాదుర్గంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. అయితే.. బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బంది ఆకలితో అలమటించారు. బందోబస్తు కోసం తెల్లవారు జామున 3 గంటలకే వచ్చినా.. ఉదయం 10 గంటలైనా అల్పాహారం ఇవ్వకపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని హోటళ్లు,దుకాణాలు మూసివేతతో టిఫిన్ దొరక్క అవస్థలు పడ్డారు.
దీర్ఘకాలిక జబ్బులు, షుగర్, బీపీ ఉన్న సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇంతలో స్థానిక పోలీసులు ఒక వాహనంలో ఇడ్లీ, బజ్జీ ప్యాకెట్లు తీసుకువచ్చారు. దీంతో వీటిని దక్కించుకునేందుకు పోలీసులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఎక్కినంత పనిచేశారు. అయినా.. కూడా కొంతమందికే టిఫిన్ దక్కడంతో మిగిలిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.