ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహించలేమంటూ ఏపీ సర్కార్, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో, ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్లయింది. ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ విషయంలో స్పీడ్ పెంచారు. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. తొలి దశ ఎన్నికల తేదీలను నిమ్మగడ్డ ప్రకటించారు. తొలి దశ ఎన్నికలకు జనవరి 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత పోలింగ్ జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి ఉన్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తికాలేదు. దీంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో దశ ఎన్నికలు నిర్వహించాల్సిన తేదీలను తొలి దశకు మారుస్తూ ఎస్ఈసీ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో, ఏపీలో తొలి దశ ఎన్నికల నామినేషన్లను జనవరి 29 నుంచి స్వీకరించనున్నారు. రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహాలు మొదలుపెట్టింది.
ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం సెక్రటరీకి లేఖ రాశారు. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరించని పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను కేటాయించాలని నిమ్మగడ్డ కోరారు. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణను జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అప్పజెప్పామని, వారు సహకరించకుంటే కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని ఆయన కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటామని తెలిపారు. చెప్పారు. నిమ్మగడ్డ లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.