నిజమే! ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఐదుగురు అధికారులు.. అప్పటికప్పుడు హైదరాబాద్‌కు వెళ్లి.. అత్యంత రహస్యంగా బాలయ్య నటించిన `వీరసింహారెడ్డి` సినిమాను చూశారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఒక నోట్ ఫైల్‌ను కూడా ఎవరికివారు సిద్ధం చేసుకున్నారట. దీనిని రెండు రోజుల్లో సీఎం జగన్‌కు అందజేయనున్నట్టు తాడేపల్లి వర్గాల నుంచి గుసగుస వినిపిస్తోంది.
అదేంటి? అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది.. అసలు విషయం. సహజంగానే బాలయ్య అనగానే.. ఆయన ను నటుడిగా కన్నాకూడా ఏపీ ప్రభుత్వంటీడీపీ నేతగానే చూస్తుంది. బాలయ్య అభిమానించే జగన్ కూడా.. ఆయనను రాజకీయ నేతగానే పరిగణిస్తుంటారు. ఈ క్రమంలోనే దాదాపు ఆయన సినిమాలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారనేది బాలయ్య అభిమానుల మాట.
ఎందుకంటే.. ఇటీవల వచ్చిన అఖండ సినిమాలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డైలాగులు సహా మరికొన్ని ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఇక, తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కూడా కొన్ని డైలాగులతో సర్కారును ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆయా డైలాగుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రబుత్వం హుటాహుటిన సీనియర్ తెలుగు అధికారులను ఈ సినిమా చూసేందుకు అనుమతించింది.
అంతేకాదు.. ఆయా అంశాలతో ఒక నోట్ ఫైల్ రూపొందించి \సీఎంవోకు ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో వారు.. హైదరాబాద్ వెళ్లారు. ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిట్లు బిట్లుగా ఉన్న వీడియోలకు లైకులు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాటిని చిత్రంలో ఏ సందర్భంలో అన్నారు.. ఎవరినుద్దేశించి అన్నారో స్వయంగా తెలుసుకోవడానికి ఏపీ సర్కారు రెడీ అయింది.
ఈ క్రమంలోనే కొందరు కీలక అధికారులు గురువారం అర్ధరాత్రి ఆ సినిమా చూసినట్లు తెలిసింది. సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నాయని గుర్తించారు. ప్రభుత్వ పెద్దలకు నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సర్కారు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.