సంక్రాంతి తర్వాత ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నగారా మోగిస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఉద్యోగులంతా వినతి పత్రాలు ఇచ్చి సర్దుకుందాం అనే ధోరణిలో ఉన్నారు. అయితే, ఒక వర్గం ఉద్యోగ సంఘాలు మాత్రం వినతిపత్రాలు అంటూ గవర్నర్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసి కనీసం తమ నిరసన తెలుపుతున్నాయి. కానీ, మరో వర్గం మాత్రం గవర్నర్ ను కలవడంపై గుర్రుగా ఉంది.
ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ఎన్జీవో సంఘం మధ్య విభేదాలు తాజాగా తార స్థాయికి చేరాయి. గవర్నర్ ను కలిసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మరికొన్ని ఇతర ఉద్యోగుల సంఘాలు వినతిపత్రం ఇచ్చిన వైనం చర్చనీయాంశమైంది ప్రభుత్వ వైఖరిపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయడాన్ని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఖండించారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగులకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగ సంఘాలు నియమనిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని బండి శ్రీనివాసరావు అన్నారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మెప్పుకోసం ఏపీ ఎన్జీవోలు పనిచేస్తున్నారని సూర్యనారాయణ అనడం సరికాదన్నారు. సూర్యనారాయణ వెనుక ఉన్నదెవరో ఉద్యోగులు గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు చాలా ఓపికపట్టామని, ఇకపైనా ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపును సూర్యనారాయణ దొంగచాటుగా తెచ్చుకున్నారని, తన డిపార్ట్ మెంట్ లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము పోరాడి పీఆర్సీని తెచ్చుకున్నామని, సమస్యలపై పోరాడలేక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారని విమర్శించారు.