ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆపకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు ఎన్నికలు నిర్వహించవద్దని, కాదని, ఎన్నికలు నిర్వహిస్తే సమ్మె చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించింది. ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏపీ ఉద్యోగ సంఘాల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతల వ్యవహార శైలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగ సంఘాలు సహకరించాలని పవన్ కోరారు. పంచాయతీ ఎన్నికలపై వైసీపీ చెబుతోన్న కుంటిసాకు సరైంది కాదని, కరోనా సమయంలో వైసీపీ నేతలు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య శాఖా సిబ్బందితోపాటు ఉద్యోగులకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారణంగా ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. వైసీపీ నేత, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి పవన్ లేఖ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం చాలాసార్లు కోర్టుకు వెళ్లిందని, అయినా చుక్కెదురైందని, ఇంకా ఎన్నిసార్లు కోర్టుకు వెళ్తారని పవన్ ప్రశ్నించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, జడ్జిలను వైసీపీ నేతలు కులాల పేరుతో దూషించారని మండిపడ్డారు. రామతీర్థం ఘటన చాలా సున్నితమైన అంశమని, అందుకే అక్కడికి తాము వెళ్ళలేదని పవన్ చెప్పారు. ఏపీలో ప్రతీ పార్టీ మత రాజకీయాలు చేస్తోందని, జనసేన మతప్రాతిపదికన ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయబోదన్నారు. వైసీపీ నేతలు బైబిల్ పట్టుకుని తిరగటం లేదా? అని పవన్ ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ నేతల దాష్టీకాలు ఎక్కువయ్యాయని, సోషల్ మీడియాలో వైసీపీని విమర్శించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కానీ, న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే కేసులు లేవని విమర్శించారు. బీజేపీతో కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమేననని పవన్ అంగీకరించారు.