ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన తొలి, రెండో విడత పోలింగ్ లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. మరో రెండు విడతల పంచాయతీ ఎన్నికలు మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో మునిసిపల్ ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తెర తీసింది. తాజాగా మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ను ఎస్ఈసీ విడుదల చేసింది.
2020లో కరోనా కారణంగా అన్ని ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించారు. ఈ క్రమంలోనే గతంలో ఆపిన చోటి నుంచే మునిసిపల్ ఎన్నికలను మొదలుపెట్టాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే షెడ్యూల్ను ఎస్ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు మార్చిన 10న పోలింగ్ జరుగనుంది.
మార్చి 10న ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగనుంది. మార్చి 13న ఉదయం 7 నుంచీ సాయంత్రం 5 వరకూ రీపోలింగ్ , మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 2, 3 తేదీలలో ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు సమయం ఉంటుందని తెలిపింది. మార్చి 3న మధ్యాహ్నం 3 తరువాత అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది. మార్చి 14న ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. మొత్తం 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది.
అయితే, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై కాకుండా మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ దృష్టి సారించడంతో ప్రభుత్వ వర్గాల్లో కూడా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. మార్చి 31లోపు వీటి నిర్వహణ సాధ్యం కాకుంటే…కొత్త ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే నిమ్మగడ్డ పదవీ కాలం పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్రం కోరాల్సి ఉంటుంది.