ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అత్యంత కీలకమైన వ్యక్తే అయినప్పటికీ.. మంత్రుల్లోనూ కొందరికి ప్రాధాన్యం ఉంటుంది. పరిపాలనలో వాళ్లు అత్యంత కీలకంగా ఉంటారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకున్నపుడు మంత్రుల భాగస్వామ్యం తప్పకుండా ఉండాల్సిందే. అందుకోసమే క్యాబినెట్ మీటింగ్‌లు జరుగుతాయి.
మంత్రుల అభిప్రాయాలు తీసుకుని.. ఏమైనా తప్పులుంటే సరి చేసుకుని తర్వాత నిర్ణయాలను ప్రకటిస్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాలు రెండింట్లోనూ మంత్రులకు ఉన్న ప్రాధాన్యం చాలా తక్కువ అన్న నిష్ఠుర సత్యాన్ని ఒప్పుకుని తీరాల్సిందే.
ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో వైఎస్ జగన్మోమహన్ రెడ్డి మంత్రులకు అస్సలు విలువ ఇవ్వరని.. అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తుంటారని.. వాళ్లదే ఏకఛత్రాధిపత్యం అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఏపీలో జగన్ తీరు మరీ ఏకపక్షంగా ఉంటుంది.
అక్కడ మంత్రులను మించి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికే ప్రాధాన్యం ఎక్కువ. కీలక నిర్ణయాల్లో ఆయన పాత్రే ఎక్కువ. ఏపీలో మంత్రులు ఎంత డమ్మీలుగా మారిపోయారో చెప్పడానికి తాజా రుజువు.. మూడు రాజధానుల బిల్లు వ్యవహారమే కోర్టులో ఎదురు దెబ్బ తగలబోతోందన్న అంచనాతో ముందే ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకున్నట్లగా భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఎంతో కీలక పరిణామం అయిన దీని గురించి మంత్రులకు కనీస సమాచారం లేదని తేలిపోయింది. ఈ బిల్లును వెనక్కి తీసుకోవడంపై ముందుగా మీడియాతో మాట్లాడింది మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. ఐతే ఆయన మాట్లాడుతున్నపుడు.. బిల్లు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో తనకు వివరాలు తెలియవని, బహుశా తమ వాళ్లు ఏమైనా టెక్నికల్‌గా, లీగల్‌గా తప్పు చేశారేమో అని అన్నారు.
మరోవైపు సీఎం జగన్ బిల్లును వెనక్కి తీసుకోనున్నట్లు సభలో ప్రకటించడానికి ముందు అసెంబ్లీకి వెళ్తున్న మరో మంత్రి పేర్ని నానిని మీడియా వాళ్లు దీని గురించి ప్రశ్నించారు. దానికాయన బదులిస్తూ.. ఏమో మనకేం తెలుసమ్మా అంటూ సమాధానం దాటవేశారు. మిగతా మంత్రుల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఉండకపోవచ్చు.
దీన్ని బట్టి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంపై కనీసం క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించలేదని, మంత్రులతో విడిగా కూడా జగన్ మాట్లాడలేదని.. ఎవరి అభిప్రాయం తీసుకోలేదని.. ఏకపక్షంగా తాను ఏదనుకుంటే అది చేస్తున్నారని స్పష్టమవుతోంది.